వైఎస్సార్‌సీపీలో చేరికలు

TDP And Congress Leaders Join In YSRCP - Sakshi

ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్పయాత్రలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి పలువురు వచ్చి చేరుతున్నారు. అరకు నియోజకవర్గంలోని అరకువేలీ, హుకుంపేట, అనంతగిరి మండలాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలోని దత్తివలస వద్ద సోమవారం మధ్యాహ్న భోజన విరామ శిబిరం వద్ద ఆ మండలాలకు చెందిన మాజీ ఎంపీటీసీ పి.చిన్నగంగులు, మాజీ వైస్‌ సర్పంచ్‌ బి.దేవయ్యదొర, మాజీ సర్పంచ్‌లు జి.మధునాయుడు, పి.శివలతో బాటు పి.పైడితల్లి, పి.అప్పారావు, ఆర్‌.రమేష్, పి.రాజుబాబులు అరకు నియోజకవర్గ సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో చేరారు. అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలోని కొంతిలి గ్రామానికి చెందిన ఏపీ గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు రేగం మత్యలింగం తన ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ నియోజకవర్గ సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఆర్టీసీను నిర్వీర్యం చేసే యత్నాలు అడ్డుకోవాలి
ప్రజాసంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో ఏపీఎస్‌ ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని విశాఖ రీజియన్‌ ఏపీఎస్‌ ఆర్టీసీ, వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూ నియన్‌ ప్రతినిధులు ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాలోని కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలోని సీమనాయుడువలస వద్ద సోమవారం సాయంత్రం జగన్‌ను కలిశారు. వైఎస్సార్‌సీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి నేతృత్వంలో విశాఖ రీజియన్‌ వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు నడింపల్లి క్రిష్ణం రాజు, విశాఖ జిల్లా అధ్యక్షుడు జీఎం నాయుడు, కార్యదర్శి బిఎల్‌.రావ్, వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు టీఎస్‌.రావు, సంయుక్త కార్యదర్శి ఎన్‌ఎన్‌.రావ్‌లు ఆర్టీసీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ఆర్టీసీ కార్మికులకు భద్రత కల్పిం చేలా పోరాటం చేయాలని కోరారు. ఇప్పటికే ఆర్టీసీలో కీలక విభాగాలన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఆర్టీసీలో నాణ్యత లేని విధి నిర్వహణలు జరుపుతున్నారని తెలిపారు. కారుణ్యనియామకాల కోసం 1200 కార్మిక కుటుంబాలు ఎదురుచూస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదన్నారు. గతంలో దివంగత మహానే వైఎస్సార్‌ ఆర్టీసీ అప్పులన్నీ మాఫీ చేసి ఆర్టీసీకి రూ.400 కోట్లు రాయితీలు కల్పించారని గుర్తుచేశారు. 5 శాతం టాక్స్‌ తగ్గించడంతో ఆర్టీసీ అభివృద్ధి బాటలో నడిచిందన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని జగన్‌కు విన్నవించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top