విద్యార్థులకు వేసవి కానుక

Summer Book Reading Programme For Students Visakhapatnam - Sakshi

విశాఖ సిటీ : వేసవి సెలవులు పిల్లలకు సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీపట్టిన తర్వాత దొరికిన విరామం. ఆ సమయంలో ఆటపాటల ఊసుల్లో పడి ఉన్న జ్ఞానాన్ని కాస్తా మరిచిపోతుంటారు. అలా జరగకుండా ఉండాలంటే.. సెలవుల సమయంలోనూ చిన్నారులు ఓ గంట సేపు పుస్తకపఠనం చెయ్యాలి. మరి వీలవుతుందా.. పిల్లల్లో ఆసక్తి కలిగించే పుస్తకాలు ఇంట్లో ఉండవు. మరెలా అనుకునే వారికి గ్రంథాలయాలు దారి చూపుతున్నాయి. పిల్లలకు వేసవి కానుకగా విద్యార్థుల విజ్ఞాన చైతన్య వేదిక పేరుతో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది.వేసవిలో చిన్నారులకు విజ్ఞాన గనిని అందించేందుకు గ్రంథాలయ సంస్థ నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది.

చిన్నారుల్లో పుస్తక పఠనంపై జిజ్ఞాస, జ్ఞాన సముపార్జనపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకునేలా వారికి నూతన ప్రేరణ అందించేందుకు సిద్ధమవుతోంది. విద్యార్థుల విజ్ఞాన ప్రత్యేక వేసవి శిబిరం పేరుతో విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఈనెల 25 నుంచి జూన్‌ 7 వరకూ కొత్త కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఉపాధ్యాయులు, వలంటీర్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ పిల్లల్లో పుస్తక పఠనంపై అవగాహన కల్పించేందుకు సమాయత్తమవుతోంది.

43 రోజుల చైతన్య కార్యక్రమం
రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని గ్రంథాలయ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల పట్ల పఠనాశక్తితో పాటు పాఠకుల సంఖ్యనూ పెంపొందించుకోవాలనే లక్ష్యంతో గ్రంథాలయాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి గ్రంథాలయం.. సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి 5 నుంచి 15 సంవత్సరాల లోపు వయసు కలిగిన విద్యార్థులకు గ్రంథాలయాలు, పుస్తక పఠనం వల్ల కలిగే లాభాలపై అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం ప్రతి పాఠశాల నుంచి గ్రంథాలయానికి కనీసం 150 నుంచి 500 మంది చొప్పున విద్యార్థుల్ని సమకూర్చుకుంటారు. ఈ నెల 24తో సెలవులు కావడంతో 25 నుంచి వేసవి శిబిరం ప్రారంభం కానుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ శిబిరం నిర్వహిస్తారు. రెండు గంటల పాటు పుస్తక పఠంతో పాటు ఆ తర్వాత కథలు చెప్పుకోవడం, చివరి గంట సమయంలో ఒక్కో రోజు ఒక్కో స్పెషల్‌ ఆర్ట్‌పై కాంపిటిషన్‌ నిర్వహిస్తారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో నగరంలో 14 గ్రంథాలయాలున్నాయి. వీటన్నింటిలోనూ విజ్ఞాన ప్రత్యేక వేసవి శిబిరం నిర్వహిస్తారు.

పోటీలు.. బహుమతులు
స్కూల్లోనూ పుస్తకాలే.. సెలవుల్లోనూ పుస్తకాలే చదవమంటే ఎలా అని విద్యార్థుల్లో కాసింత అసహనం కలుగుతుంది. దాన్ని పోగొట్టేందుకు గ్రంథాలయాల సంస్థ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒక బృందం వచ్చి గంట సేపుపుస్తక పఠనం చేశాక.. చివర్లో ఆ విద్యార్థుల్ని టీంలుగా విడగొట్టి క్విజ్‌ పోటీలు, స్పీడ్‌ రీడింగ్, ఇంగ్లిష్, తెలుగు స్పెల్లింగుల ఆటలు, డ్రాయింగ్, పెయింటింగ్, పేపర్‌ క్రాప్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, గెస్ట్‌ లెక్చర్, థియేటర్‌ ట్రైనింగ్‌ మొదలైన పోటీలు నిర్వహిస్తారు. వాటిలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నారు. దీంతోపాటు విద్యార్థులు పుస్తకాలు చదువుతున్నప్పుడు వాటిలో వచ్చే సందేహాల్ని నివృత్తి చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

వేసవిలో ఉపయోగం
ఈ విజ్ఞాన చైతన్య వేదిక ద్వారా పిల్లలకు అనేక లాభాలున్నాయి. ఉచితంగానే వందలాది పుస్తకాలు చదివే అవకాశం లభిస్తుంది. పఠనాసక్తి కలుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అనేక కొత్త విషయాలు తెలుసుకునే అవకాశముంది. క్రమశిక్షణ, సత్ప్రవర్తన, సృజనాత్మకత వికసిస్తుంది. వ్యక్తిత్వ వికాసం వృద్ధి చెందుతుంది. మన సంస్కృతి సంప్రదాయాల గురించి అనేక విషయాలు అవగతమవుతాయి. వేసవిలో ఎండల కారణంగా అనారోగ్యాల బారిన పడకుండా ఉండటమే కాకుండా నేర్చుకున్న విద్యను మరిచిపోయే అవకాశం కూడా ఉండదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top