వివాహమై ఏళ్లు గడుస్తున్నా... సంతానం కలగకపోవటంతో మనస్థాపానికి గురైన దంపతులు ఆత్మహత్నాయత్నం చేశారు.
మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ : వివాహమై ఏళ్లు గడుస్తున్నా... సంతానం కలగకపోవటంతో మనస్థాపానికి గురైన దంపతులు ఆత్మహత్నాయత్నం చేశారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. చిలకలపూడి సీఐ టి. సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గూడూరు మండలం రాయవరం గ్రామానికి చెందిన పోతర్లంక రాఘవులు, పద్మ భార్యాభర్తలు. ఇస్త్రీ పనులు చేసుకుంటూ జీవించే వీరికి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగలేదు. దీంతో నిత్యం మనస్థాపంతో గడుపుతుండేవారు. పిల్లలు లేని జీవితం వృథా అనుకున్న వారిద్దరూ శుక్రవారం మధ్యాహ్నం మంగినపూడి బీచ్‌కి వచ్చారు. కాసేపు సరాదాగా గడిపారు.
అనంతరం వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. చాలాసేపటి వరకు వీరిలో ఎలాంటి మార్పు జరగకపోవడంతో ఆటో ఎక్కి చిలకలపూడి రైల్వేస్టేషన్‌కు వచ్చారు. అలా వచ్చిన వీరు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నాన్ని పసిగట్టిన స్థానికులు వారివురిని బలవంతంగా ఫ్లాట్‌ఫాంపైకి లాగేశారు. అనంతరం వారి పరిస్థితిని గమనించి 108కు సమాచారం అందించగా, వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా పద్మ పరిస్థితి విషమంగా ఉండగా రాఘవులు పరిస్థితి బాగానే ఉంది.
ఈ సంఘటనపై సమాచారం అందుకున్న చిలకలపూడి సీఐ సత్యనారాయణ, ఎస్సై లోవరాజు ఆసుపత్రికి చేరుకుని పద్మ నుంచి వివరాలు సేకరించి బాధితుల బంధువులకు సమాచారం అందించారు. అనంతరం సీఐ సంబంధిత రూరల్ పోలీసులకు విషయాన్ని తె లియజేశారు.