కౌలు రైతులు, చేనేత సంఘాలకు రుణ సాయాన్నిపెంచండి | Subhash Chandra Bose and Kannababu And Bhuggana asked bankers for loans to Farmers and Weaving communities | Sakshi
Sakshi News home page

కౌలు రైతులు, చేనేత సంఘాలకు రుణ సాయాన్నిపెంచండి

Jan 8 2020 4:56 AM | Updated on Jan 8 2020 4:56 AM

Subhash Chandra Bose and Kannababu And Bhuggana asked bankers for loans to Farmers and Weaving communities - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: కౌలు రైతులకు బ్యాంకర్ల నుంచి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బ్యాంకర్లను కోరారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. కుటీర, చిన్న తరహా పరిశ్రమలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాయని, వీటిపై కూడా బ్యాంకర్లు దృష్టి సారించాలన్నారు. కౌలు రైతులకు సహకారాన్ని అందించాలని కోరారు. అలాగే చేనేత సహకార సంఘాలకు రుణ సహాయాన్ని పెంచాలన్నారు. చిన్న పరిశ్రమల పునరుద్ధరణ కోసం వైఎస్సార్‌ నవోదయం కార్యక్రమాన్ని  మరింత బలోపేతం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బ్యాంకర్లను కోరారు. దీనికోసం బ్యాంకర్లు, పరిశ్రమల శాఖ మధ్య మరింత సమన్వయం, పర్యవేక్షణ అవసరమన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు.  కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి క్షేత్రస్థాయిలో బ్యాంకులు ముందుకు రావడం లేదన్నారు. దీనిపై జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరారు.

పొగాకు రైతుల రుణాలను పునర్వ్యవస్థీకరించాం 
ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల రుణాలను పునర్వ్యవస్థీకరించామని, ఇందుకు సహకరించిన రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ)కి ధన్యవాదాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) చైర్మన్‌ పకీరిసామి చెప్పారు. వార్షిక రుణప్రణాళిక మేరకు సెప్టెంబర్‌ 2019 నాటికి వివిధ ప్రాధాన్య రంగాల్లో నిర్దేశించిన రూ.1,69,200 కోట్లకు గాను రూ.94,531 కోట్లు (55.87 శాతం) రుణాలు ఇచ్చామన్నారు. అదేవిధంగా ఇదే కాలానికి వ్యవసాయ రంగంలో రూ.1,15,000 కోట్లకు గాను, రూ.65,577 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఎంఎస్‌ఎంఈ కింద నిర్దేశించిన రూ.36 వేల కోట్ల లక్ష్యానికి గాను రూ.25,020 కోట్ల (69.60 శాతం) రుణాలు ఇచ్చామని వెల్లడించారు. 

వైఎస్సార్‌ జిల్లాలో పూర్తి స్థాయిలో డిజిటల్‌ లావాదేవీలు
వైఎస్సార్‌ జిల్లాలో పూర్తి స్థాయిలో డిజిటల్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆర్బీఐ రీజినల్‌ డైరెక్టర్‌ సుబ్రతోదాస్‌ తెలిపారు. కౌలు రైతులకు రుణాలు ఆశించినంతగా ఇవ్వలేదని, అనుకున్న లక్ష్యం మేరకు ఇవ్వాల్సిందేనని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కౌలు రైతుల చట్టాన్ని తెచ్చిందని, బ్యాంకులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన వెంటనే ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారాన్ని అందించాలన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను నెల రోజుల్లో రూపొందించాలని బ్యాంకర్లకు సూచించారు. కాగా, ఉద్యానవన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్థక శాఖల్లో అనుకున్న దానికన్నా రుణాలు తక్కువగా ఇచ్చారని, బ్యాంకులు దీనిపై దృష్టిపెట్టాలని నాబార్డ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సెల్వరాజ్‌ కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement