ఆర్టీసీలో సమ్మె యోచన విరమణ

Strike retirement in the RTC - Sakshi

విలీన నిర్ణయంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జేఏసీ నేతలు

అనంతరం సమ్మె యోచన విరమించుకుంటున్నట్లు వెల్లడి

సాక్షి, అమరావతి: తాము చేయతలపెట్టిన సమ్మెను విరమించుకుంటు న్నట్టు ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం సచివాలయంలో కలిసిన జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జేఏసీ నేతలు వలిశెట్టి దామోదరరావు, సీహెచ్‌ సుందరయ్య, వి.వరహాలనాయుడు, వైవీ రావు అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఆర్టీసీని విలీనం చేస్తామంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వారు చెప్పారు. కృతజ్ఞతలు తెలియజేసిన తమతో ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం తమ భుజం తట్టి చెప్పారన్నారు. ‘ఆర్టీసీకి ఎన్ని నష్టాలున్నా.. ప్రభుత్వమే భరిస్తుంది.. మీ భవిష్యత్తు నేను చూసుకుంటా.. ప్రభుత్వ ఉద్యోగులకు అందే సౌకర్యాలన్నీ మీకు అందుతాయి. ప్రైవేటు బస్సులకు దీటుగా ఆర్టీసీ బస్సులను నడపాలని’’ సీఎం తమకు చెప్పారని జేఏసీ నేతలు వివరించారు.

ఆర్టీసీ అప్పులను, కేటాయించాల్సిన బడ్జెట్‌ గురించి జేఏసీ నేతలు ప్రస్తావించగా.. అవన్నీ ఆర్థికశాఖ చూసుకుంటుందని చెప్పారన్నారు. సీఎం తమ పట్ల కనబరిచిన ఆప్యాయత, స్పందన ఆనందదాయకంగా ఉందన్నారు. రవాణా, ఆర్ధిక శాఖ మంత్రులతో కూడిన కమిటీ త్వరలో నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతుందని సీఎం భరోసా ఇచ్చారని నాయకులు చెప్పారు. విలీన ప్రక్రియ పూర్తి అయితే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఆర్టీసీ ఉద్యోగులు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వపరం చేయడం వల్ల 55 వేల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది’ అని జేఏసీ కన్వీనర్‌ దామోదరరావు పేర్కొన్నారు. రవాణా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, రవాణా, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుతో కలిసి వెళ్లి సచివాలయంలో సీఎంను కలిసి వచ్చామని వివరించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె యోచన విరమిస్తున్నట్లు ప్రకటించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top