ఈ నెల 12 నుంచి నిర్వహించే ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఏ కారణంతోనైనా హాల్ టికెట్లను నిరాకరిస్తే కఠిన చర్యలు చేపడతామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
ఇంటర్ బోర్డు కార్యదర్శి హెచ్చరిక.. 12 నుంచి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12 నుంచి నిర్వహించే ఇంటర్ పరీక్షలకు హాజర య్యే విద్యార్థులకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఏ కారణంతోనైనా హాల్ టికెట్లను నిరాకరిస్తే కఠిన చర్యలు చేపడతామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ట్యూషన్ ఫీజు చెల్లించలేదనే సాకుతో హాల్‌టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే.. సదరు కళాశాల గుర్తింపు రద్దుకూ వెనుకాడబోమన్నారు.
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని, ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్‌లోకి అనుమతించబోరని నాయక్ స్పష్టం చేశారు. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, అప్పటినుంచే వారిని హాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. కాగా విద్యార్థులను ఉదయం 8:45 గంటలలోపే హాల్లోకి అనుమతిస్తారని, అయితే 8:45 గంటల నుంచి 9 గంటలవరకు అనుమతించినప్పటికీ.. ఆలస్యానికి కారణాన్ని రికార్డు చేసి లోనికి పంపుతారని వివరించారు.