నాయుడుపేటలోని గోమతి సెంటర్ సమీపంలోని పెట్రోలు బంకు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
Aug 26 2013 5:16 AM | Updated on Sep 3 2019 9:06 PM
నాయుడుపేట టౌన్,న్యూస్‌లైన్: నాయుడుపేటలోని గోమతి సెంటర్ సమీపంలోని పెట్రోలు బంకు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఆగి ఉన్న లారీ ని కారు ఢీకొనడంతో ఈ విషాదం చోటు చేసుకొంది. మృతుల్లో ఒకరు వైఎస్సార్‌సీపీ నాయకుడు కాగా మరొకరు రియల్టర్. నాయుడుపేట మండలం పుదూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు బోమిడి చంద్రయ్య(45), స్నేహితులు తుమ్మూరుకు చెందిన కల్లూరి రవి(42), విన్నమాల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆమవరపు సత్యం,
న్యాయవాది పసల గంగాప్రసాద్ ఓ కారులో శ్రీకాళహస్తి వైపు నుంచి నాయుడుపేటకు వస్తున్నారు. గోమతి సెంటర్ సమీపంలో కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో కారు సగభాగం లారీలోకి చొచ్చుకెళ్లి నుజ్జునుజ్జయింది. చంద్రయ్య, రవి కారులోనే ఇరుక్కుని అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. కారు నడుపుతున్న గంగా ప్రసాద్‌తో పాటు సత్యం గాయాలతో బయటపడ్డారు. గంగాప్రసాద్ తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. సీఐ ఎన్ రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహా లను నాయుడుపేట ప్రభు త్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
నాయుడుపేటలో విషాదం
ప్రమాద విషయం తెలిసిన వెంటనే నాయుడుపేటలో విషాదం నెలకొంది. పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు గంటపాటు శ్రమించారు.
చిరునవ్వులతో వెళ్లి
కానరాని లోకాలకు
చంద్రయ్య గ్రామస్తులతో మాట్లాడిన కొన్ని గంటలకే కానరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని కుటుంబసభ్యులతో పాటు బంధుమిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్సార్‌సీపీలో చురుగ్గా వ్యవహరించే చంద్రయ్య ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండేవారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. చంద్రయ్యకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. రవికి కవల కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
Advertisement
Advertisement