సముద్రంలో మునిగిపోయిన స్టీల్‌ బార్జి

Steel barge submerged In The Sea - Sakshi

600 టన్నుల బియ్యాన్ని ఓడలో లోడ్‌ చేసేందుకు వెళుతుండగా ప్రమాదం  

అకస్మాత్తుగా వీచిన పెనుగాలులకు అలలు ఎగసిపడి బార్జిలోకి నీరు 

సురక్షితంగా బయటపడ్డ కళాసీలు 

రూ.5 కోట్ల మేర నష్టం.. కాకినాడ వద్ద ఘటన

కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి ఆఫ్రికాకు వెళ్లే ఓడలోకి బియ్యం లోడ్‌ చేసేందుకు వెళ్తున్న స్టీల్‌ బార్జి ఆదివారం ఉదయం సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి 12 మంది కళాసీలు తృటిలో తప్పించుకున్నారు. రూ.5 కోట్ల మేర నష్టం సంభవించి ఉంటుందని పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మెస్సర్స్‌ లోటస్‌ మెరైన్‌ కంపెనీ ఇచ్చిన ఆర్డర్‌ మేరకు కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా వెళ్లే ఓడలోకి 600 టన్నుల బియ్యం లోడ్‌ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మేళం తాండవకృష్ణకు చెందిన బి–81వ నంబర్‌ స్టీల్‌ బార్జిలోకి శనివారం రాత్రి బియ్యం లోడ్‌ చేశారు. ఆదివారం ఉదయమే ఓ బోటుతో ఈ బార్జిని ఓడ వద్దకు చేర్చారు. ఓడ సమీపంలోకి వెళ్లేసరికి బలమైన గాలులు వీయడంతో ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

ఆ సమయంలో బార్జిపై 12 మంది కళాసీలున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన కళాసీలు బార్జిని తిరిగి యాంకరేజ్‌ పోర్టుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఒక్కసారిగా పెనుగాలులు వీచాయి. దీంతో అలలు ఎగసిపడి బార్జిలోకి నీరు ప్రవేశించింది. అది మునిగిపోతుండడాన్ని గమనించిన కళాసీలు కేకలు పెట్టారు. దీంతో బార్జిని తీసుకెళ్తున్న బోటులోని వారు వెంటనే స్పందించి బార్జికి, బోటుకు ఉన్న రోప్‌ను కట్‌ చేశారు. లేకుంటే బోటు కూడా మునిగిపోయేదని బార్జిలో ఉన్న సరంగు దుర్గారావు చెప్పారు. బార్జి మునిగిపోతుండటంతో దానిలో ఉన్న 12 మంది కళాసీల్లో 8 మంది బోటు ఎక్కేశారు. మరో నలుగురు కళాసీలు బోటు ఎక్కే ప్రయత్నంలో సముద్రంలో పడిపోయారు. వారిని బోటులోని వారు రక్షించారు. దీంతో వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.

వారు చూస్తుండగానే 600 టన్నుల బియ్యంతో బార్జి సముద్రంలో మునిగిపోయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి వాతావరణంలో మార్పులొచ్చి, వర్షం కూడా పడింది. అయినా పోర్టు అధికారుల ఒత్తిడి మేరకే బార్జిని సముద్రంలోని ఓడ వద్దకు తీసుకెళ్లినట్టు కొందరు కళాసీలు చెబుతున్నారు. ప్రమాదంలో బార్జి యజమానికి రూ.3 కోట్ల వరకూ నష్టం వాటిల్లి ఉంటుందని, అందులోని బియ్యం విలువ మరో రూ.2 కోట్లు ఉండొచ్చని పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంపై బార్జి యజమాని మేళం తాండవకృష్ణ పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ మెరైన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top