సీబీఐ దర్యాప్తును రాష్ట్రం అడ్డుకోలేదు | States Can not Prevent CBI Investingations | Sakshi
Sakshi News home page

Nov 17 2018 11:25 AM | Updated on Nov 17 2018 11:33 AM

States Can not Prevent CBI Investingations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసేందుకు అనుమతి ఉపసంహరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయ వర్గాలు తప్పుపడుతున్నాయి. అనుమతి ఉపసంహరణకు ప్రభుత్వం చెప్పిన కారణం హాస్యాస్పదంగా ఉందంటున్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం సీబీఐపై ఏ రకమైన ప్రభావం చూపదంటున్నాయి. కేంద్రప్రభుత్వ పరిధిలోకొచ్చే అంశాల విషయంలో సీబీఐ నేరుగా దర్యాప్తు చేయవచ్చునని, ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదంటున్నాయి. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారాల్ని పొందుపరిచారని, అలాగే ఉమ్మడి అధికారాలనూ ప్రస్తావించారని, అంతిమంగా రాష్ట్ర అధికారంపై కేంద్ర అధికారమే చెల్లుబాటవుతుందని గుర్తు చేస్తున్నాయి. తనమీద ఉన్న అవినీతి ఆరోపణలపై సీబీఐ ఎక్కడ దర్యాప్తు చేసి జైలుపాలు చేస్తుందోనన్న భయంతోనే సీఎం చంద్రబాబు రాజకీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోనక్కర్లేదు..
కేంద్రప్రభుత్వ పరిధిలోకొచ్చే అంశాలు, కేంద్రప్రభుత్వ నిధులతో ముడిపడిన వ్యవహారాలు, జాతీయ కంపెనీలు, బ్యాంకులు తదితరాలపై వచ్చే ఫిర్యాదులమీద సీబీఐ నేరుగా దర్యాప్తు చేయవచ్చు. వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ విషయాల్లో ఇప్పటివరకు నమోదు చేసిన కేసులన్నింటిలోనూ సీబీఐ రాష్ట్రప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. భవిష్యత్తులోనూ సీబీఐ ఇలానే స్వతంత్రంగా వ్యవహరిస్తుందని పేర్కొంటున్నాయి. రాష్ట్రచట్టాల పరిధిలోకొచ్చే అంశాలకు సంబంధించి దర్యాప్తు చేయాలంటేనే రాష్ట్రప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నాయి.

అవినీతి ఆరోపణలపై విచారణ నుంచి తప్పించుకునేందుకే..
ఇప్పటివరకు సీబీఐకి అనుమతిని ఉపసంహరించిన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఆ నిర్ణయాన్ని రాజకీయకోణంలోనే తీసుకున్నాయని న్యాయవర్గాలు చెప్పాయి. సీఎంలమీద వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించే వీలున్నప్పుడు, వారిపై సీబీఐ కేసు నమోదు చేసినప్పుడు దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఉపసంహరణవైపు మొగ్గుచూపాయంటున్నాయి. ఉత్తరాఖండ్, సిక్కిం, కర్ణాటక.. ఇలా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తమ సీఎంల అవినీతిపై సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు సీబీఐకి అనుమతిని ఉపసంహరిస్తూ ఉత్తర్వులిచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ దిశగానే నిర్ణయం తీసుకుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీలతోపాటు ఆర్థిక అవకతవకలకు సంబంధించి పలువురు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ వ్యక్తులపై సీబీఐ నేరుగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిందని, ఇందులో ఎక్కడా రాష్ట్రప్రభుత్వ అనుమతే తీసుకోలేదని న్యాయవర్గాలు తెలిపాయి. ఆయా కంపెనీలు రుణాలు తీసుకుని ఎగవేసినప్పుడు జాతీయ బ్యాంకులు చేసే ఫిర్యాదులపైనా సీబీఐ నేరుగా దర్యాప్తు చేసిందేతప్ప రాష్ట్రాల అనుమతి కోరలేదన్నాయి. బ్యాంకుల అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సీబీఐ స్వతంత్రంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మధ్యప్రదేశ్‌లో వ్యాపం స్కాం విషయంలోనూ రాష్ట్రప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇలా అనేక కేసుల్లో సీబీఐ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తోందని, ఏ వ్యవహారానికి సంబంధించైనా ప్రాథమిక విచారణ జరిపే విషయంలో సీబీఐ సంబంధిత రాష్ట్రప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

నిప్పు అయితే భయమెందుకు?
సీఎం చంద్రబాబుకు ఆయన అవినీతి గురించి చాలా స్పష్టతుంది. అందుకే తనపై ఎక్కడ సీబీఐ దర్యాప్తు జరుగుతుందోనని ఆయన భయపడుతున్నారు. ఎవరైనా తాను నిజాయితీపరుడినని భావిస్తే ఏ విచారణకైనా సిద్ధమని సవాలు చేస్తారు. దీనికి విరుద్ధంగా చంద్రబాబు సీబీఐ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివెనుక దురుద్దేశాలున్నాయి. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే. సీబీఐలో అంతర్గత విభేదాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఆయన చెబుతున్న కారణం నవ్వు తెప్పిస్తోంది. గుమ్మడికాయ దొంగలెవరంటే భుజాలు తడుముకున్నట్లు చంద్రబాబు వైఖరుంది. ప్రభుత్వ పెద్దలు ఎంత పెద్ద అవినీతికి పాల్పడినా సీబీఐ పట్టించుకోవద్దన్న మాట. సీబీఐకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముంది.    
    – జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి, రిటైర్డ్‌ న్యాయమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement