
జిల్లాలోనే సరిహద్దులు
రాష్ట్ర విభజన జరిగిపోయింది. అధికారులు, సిబ్బంది పంపకాల్లో ఉన్నతాధికారులు తలమునకలై ఉన్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని ఏర్పాటుపై పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సాక్షి, గుంటూరు :రాష్ట్ర విభజన జరిగిపోయింది. అధికారులు, సిబ్బంది పంపకాల్లో ఉన్నతాధికారులు తలమునకలై ఉన్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని ఏర్పాటుపై పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భౌగోళికంగా రాష్ట్రాన్ని ఎలా విభజించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. జూన్ రెండో తేదీనుంచే అధికారికంగా కొత్త రాష్ట్రంలోనే కార్యకలాపాలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సరిహద్దులు కూడా నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది బోర్డర్ చెక్‌పోస్టులను అధికారికంగా ఏర్పాటు చేయగా అందులో రెండు గుంటూరు జిల్లా సరిహద్దుల్లోనే ఏర్పాటు చేయాలని భావించడం గమనించదగ్గ విషయం. దేవరకొండ నుంచి మాచర్ల వైపునకు వెళ్ళే రహదారిలో నాగార్జున సాగర్ వద్ద ఒక బోర్డర్ చెక్‌పోస్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
అదేవిధంగా మిర్యాలగూడెం నుంచి ఒంగోలు వెళ్ళే రహదారిలో దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద మరో బోర్డర్ చెక్‌పోస్టును ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం అధికారికి ప్రకటన వెలువడింది. ఈ చెక్‌పోస్టుల ఏర్పాటు ద్వారా ఇక రెండు రాష్ట్రాలకూ పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్లేననే వాదన వినవస్తోంది. గుంటూరు జిల్లాలోని కృష్ణానదీ తీరంలో ఉన్న అనేక ప్రాంతాల నుంచి తెలంగాణా ప్రాంతంలోని నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాలకు నిత్యం భారీఎత్తున ఇసుక రవాణా అవుతుంది. అదేవిధంగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడెం పట్టణంలో ఉన్న రైస్‌మిల్లులకు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రైతులు ట్రాక్టర్ల ద్వారా తాము పండించిన ధాన్యాన్ని నేరుగా వెళ్లి అమ్ముకుంటుంటారు. ఈ బోర్డర్ చెక్‌పోస్టుల ఏర్పాటు వల్ల ఇరుప్రాంతాల్లోని రైతులు, వ్యాపారులు తీవ్ర కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.