బోగస్‌బాబు అనాలా.. దొంగబాబు అనాలా? | srikanth reddy blames chandra babu naidu | Sakshi
Sakshi News home page

బోగస్‌బాబు అనాలా.. దొంగబాబు అనాలా?

Jan 4 2014 2:59 AM | Updated on Jul 28 2018 6:43 PM

బోగస్‌బాబు అనాలా.. దొంగబాబు అనాలా? - Sakshi

బోగస్‌బాబు అనాలా.. దొంగబాబు అనాలా?

కుప్పం శాసనసభ నియోజకవర్గంలో 43 వేలకుపైగా బోగస్ ఓట్లను నమోదు చేయించుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును బోగస్‌బాబు అనాలా..

సాక్షి, హైదరాబాద్: కుప్పం శాసనసభ నియోజకవర్గంలో 43 వేలకుపైగా బోగస్ ఓట్లను నమోదు చేయించుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును బోగస్‌బాబు అనాలా... లేక దొంగబాబు అనాలా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, 1989లో కుప్పం నుంచి చంద్రబాబు తొలిసారి పోటీ చేసినపుడు 6 వేలు మెజారిటీ మాత్రమే వచ్చిందని, ఆ తరువాత రెండు ఎన్నికలలో అది వరుసగా 44 వేలు, 50 వేలకు పెరిగిందని చెప్పారు. ఈ భారీ మెజారిటీ బోగస్ ఓట్ల మహిమేనన్నారు. ఆయన విజయరహస్యం అచ్చంగా అవేనని విమర్శించారు.

 

కుప్పంలోని మొత్తం 1.96 లక్షల ఓట్లలో 43 వేలు బోగస్‌వి ఉన్నాయని స్వయంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారే నిర్ధారించారని గుర్తు చేశారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన సరిహద్దు ఓటర్లను చంద్రబాబు చేర్పించుకున్నారని చెప్పారు. ఆయనకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే తిరుమల వేంకటేశ్వరస్వామిపై గానీ, కాణిపాకం వినాయకునిపై గానీ ప్రమాణం చేసి బోగస్ ఓట్లు చేర్పించలేదని చెప్పగలరా? అని సవాలు విసిరారు.
 
 రాజకీయాల్లో కూడా బోగస్ నీతిని అనుసరించి, వాటిని దిగజార్చిన ఘనత కూడా బాబుదేనని విమర్శించారు. కుప్పంలో తేలిన బోగస్ ఓటర్ల విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా దర్యాప్తు చేయించాలని, ఇందుకు కారణమైన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఉరవకొండ, ఎల్బీనగర్‌తో పాటు అనేక నియోజకవర్గాల్లో బోగస్ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తున్నందున వాటిపై కూడా విచారణ జరపాలన్నారు. అవినీతి గురించి ఇతరులపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు... ముందుగా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధపడాలన్నారు. విభజన బిల్లు రావడానికి చాలా ముందుగానే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరిందని, అయితే పట్టించుకోకుండా ఇప్పుడు తానే సమైక్య చాంపియన్‌నని చెప్పుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఓ వైపు విభజనకు కిరణ్ అధిష్టానానికి పూర్తిగా సహకరిస్తోంటే మరోవైపు చంద్రబాబు రెండు నాల్కల సిద్ధాంతంతో వంత పాడుతున్నారన్నారు. అసెంబ్లీలో టీడీపీ సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలో స్క్రిప్టులను కూడా ఒకేచోటి నుంచి వస్తున్నాయని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన బిల్లుపై అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి పంపిన వర్తమానాన్ని కేంద్రం రాష్ట్రానికి పంపిన తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం బంద్ సంపూర్ణంగా విజయవంతమైందని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించారని, వ్యాపార సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని బంద్‌లో పాల్గొన్న వారందరికీ, పార్టీ శ్రేణులకు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement