అనంతపురం జన ప్రభంజనం

Special Story About Population Day In Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాలో జనాభా ఏటా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 40,81,148కు (అనధికారికంగా ఈ సంఖ్య 44 లక్షలకు చేరుకున్నట్లు అంచనా) చేరుకుంది. ఇందులో 20,64,495 మంది పురుషులు, 20,16,653 మంది మహిళలు ఉన్నారు.  దీని ప్రభావంతో ప్రజలకు కనీస సౌకర్యాలు అందకుండా పోయాయి. పెరిగిన జనాభాకు తగ్గట్లు అవసరాలు తీర్చే వనరులు లేకుండా పోయాయి.

ఆశలు, ఆకాంక్షలు అపరిమితమైపోతున్నాయి. తీర్చగలిగే సంపద, సేవలు, సరుకులు అంతరించి పోతున్నాయి. పర్యవసానం జన విస్ఫోటనం. ప్రజలు భూమికి భారమై, శాపమై పోతున్నారు. కనుకనే దేశాల మధ్య జల, జన యుద్ధాలు, ఆధిపత్య పోరాటాలు, భూమి, సహజ సంపదలను దోచుకోవడాలు, దాచుకోవడాలు జరుగుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభా తద్వారా తలెత్తే దుష్పరిణామాలను వివరించేందుకు, సమస్యలపై అవగాహన కలిగించేందుకు ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు 1989 నుంచి ఏటా జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

2001 సంవత్సరంలో అప్పటి లెక్కల ప్రకారం జిల్లా జనాభా 31 లక్షలుండేది. జనాభా పెరుగుదలకు తగ్గట్లు వైద్య సేవలను అందించడంలో గత ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. 500 పడకల ఆస్పత్రిగా పేరున్న ప్రభుత్వ సర్వజనాస్పత్రిని ఇటీవల 750 పడకల ఆస్పత్రిగా మార్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రోజూ 3వేల మంది వైద్య సేవలు పొందుతున్నారు. ఐదు మంది రోగులకు ఒక్క స్టాఫ్‌నర్సు పని చేయాల్సిన చోట వంద మంది రోగులకు ఒక్కరు పనిచేయాల్సి వస్తోంది.  ఇక పీహెచ్‌సీల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలోని 88 పీహెచ్‌సీలు, సీడీ ఆస్పత్రి, హిందూపురంలోని జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు, 15 సీహెచ్‌సీల్లో రోజూ 70 వేల నుంచి 80 వేల ఓపీ ఉంటుంది. కానీ వైద్యులు, స్టాఫ్‌నర్సులు, క్లాస్‌ 4 సిబ్బంది ఆశించిన స్థాయిలో లేరు. దీంతో పాటు మందుల కొరత తీవ్రంగా ఉంది.  

దక్కని ఉపాధి ఉద్యోగావకాశాలు  
జనాభా పెరుదుల ప్రభావం ఉపాధి, ఉద్యోగావకాశాలపై ప్రత్యక్షంగా చూపుతోంది. ఉపాధి కోసం యువత ఎదురు చూడాల్సి వస్తోంది. మానవ వనరులను ఉపయోగించుకోవడంలో గత టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. డిగ్రీలు, పీజీలు చేసిన వారు సైతం క్లాస్‌ 4 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. గత ప్రభుత్వం లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చి.. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టింది. ఉపాధి దొరకపోవడంతో ఎంతో మంది వ్యసనాలకు బానిసలుగా మారి పక్కదారి పడుతున్నారు. నేర ప్రవృత్తి పెరిగిపోయింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top