బాబోయ్‌.. కొంపకొల్లేరు

Special Interview With Venkata Surya Narayana Raju About Kolleru Lake  - Sakshi

సాక్షి, ఆకివీడు : ముఖ్యమంత్రి చంద్రబాబు తీరువల్లే కొల్లేరు సమస్య పరిష్కారం కావడం లేదని, దీనికోసం ఈ సర్కారు తీసుకున్న ప్రత్యేక చర్యలేమీ లేవని రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర కార్యదర్శి మంతెన వెంకట సూర్యనారాయణరాజు ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లేరుపై పలు అధ్యయన కమిటీలు  వేసినా.. నివేదికలను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాంటూర్‌ కుదింపు సాధ్యం కాదని, ఇలాంటి హామీలతో టీడీపీ ప్రజలను మభ్యపెడుతోందని, కొల్లేరు సమస్యకు ఇది పరిష్కారం కాదని స్పష్టం చేశారు. 5వ కాంటూర్‌ వరకూ కొల్లేరును అభివృద్ధి చేయాల్సిందేనని, కొల్లేరు జాతీయ సరస్సుగా గుర్తింపు పొందినప్పుడే దీనికి ప్రాముఖ్యం పెరుగుతుందని, ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని స్పష్టం చేశారు.
 
సాక్షి : కొల్లేరు సరస్సుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది?
సూర్యనారాయణరాజు : కొల్లేరు సరస్సు పరీవాహక ప్రాంతంలో చేపల చెరువులు భారీగా తవ్వడం వల్ల సరస్సు కుచించుకుపోయింది. 1971లో ఇరాన్‌లోని రామ్‌సర్‌ నగరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ దేశాలు తీసుకున్న నిర్ణయాలపై కేంద్రం సంతకం చేసింది. దానిలో కొల్లేరు సరస్సు పరిరక్షణ కూడా ఉంది. 
సాక్షి : రామ్‌సర్‌ ఒప్పందం నుంచి బయటకు రాలేమా?
సూర్యనారాయణరాజు : రామ్‌సర్‌ ఒప్పందం నుంచి బయటకు రావడం సాధ్యం కాదు.  వస్తే ప్రపంచ దేశాలు వెలివేస్తాయి. మంచినీటి సరస్సును రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సహజ సిద్ధంగా ఏర్పడిన సరస్సులను పరిరక్షించేందుకు రామ్‌సర్‌ ఒప్పందం జరిగింది. 
సాక్షి :    కొల్లేరుపై జీఓ 120 ఎందుకు విడుదల చేశారు. 
సూర్యనారాయణరాజు : రామ్‌సర్‌ ఒప్పందాన్ని అమలు జరిపేందుకే కొల్లేరును అభయారణ్యం చట్ట పరిధిలోకి తీసుకువచ్చేందుకు 120 జీఓను విడుదల చేశారు. జీఓను అప్పటి టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయలేదు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలుచేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. జీఓను అమలు జరిపితే కొల్లేరు సరస్సు పరిరక్షణ సాధ్యమవుతుంది.  
సాక్షి : అభయారణ్యం పరిధిలో కొల్లేరు సమస్య ఏమిటి?
సూర్యనారాయణరాజు : కొల్లేరు సరస్సును 5వ కాంటూర్‌ వరకూ గుర్తించి ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా పరిగణించారు. అభయారణ్యం పరిధిలో 72 వేల ఎకరాల భూమి ఉంది. దీనిలో ప్రైవేటు వ్యక్తుల భూమి(జిరాయితీ) 14 వేల ఎకరాలు ఉంది. ప్రైవేటు వ్యక్తుల భూమి ఉన్నప్పుడు అభయారణ్యంగా గుర్తించకూడదు. 
సాక్షి : కొల్లేరు జిరాయితీ రైతుల పరిస్థితి ఏమిటి?
సూర్యనారాయణరాజు : కొల్లేరులోని జిరాయితీ రైతులకు నష్టపరిహారం కేంద్రమే ఇవ్వాల్సి ఉంది. కేంద్ర పరిధిలో ఉన్న ఈ భూములకు నష్టపరిహారం కింద ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంది. పోలవరం నిర్వాసితులకు చెల్లించినట్టే జిరాయితీ రైతుల్ని ఆదుకోవాల్సి ఉంది. సుమారు రూ.4 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏటా రూ.1,000 కోట్లు చెల్లించినా సరిపోయేది. కానీ సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా కొల్లేరు భూస్వాములు అయినా.. తినడానికి తిండిలేక,  పిల్లలకు పెళ్లిళ్లు చేయలేని దుస్థితిలో ఉన్నారు. జిరాయితీని ఎటూ తేల్చలేకపోవడం దారుణం.
సాక్షి : కొల్లేరుపై వేసిన కమిటీల నివేదికలపై చర్యలు తీసుకున్నారా?
సూర్యనారాయణరాజు : కొల్లేరుపై పదికిపైగా కమిటీలు వేశారు. కొల్లేరు పరిరక్షణకు చర్యలు ఎలా తీసుకోవాలనే దానిపై నిపుణుల కమిటీని కూడా వేశారు. కమిటీల నివేదికలు బుట్టదాఖలవుతున్నాయి. అజీజ్‌ కమిటీ నివేదిక అమలుచేస్తే కొల్లేరు సరస్సుకు, జిరాయితీ రైతులకు మేలు జరుగుతుంది. 
సాక్షి : కొల్లేరును రక్షించాలంటే ఇంకేమి చేయాలి?
సూర్యనారాయణరాజు : కొల్లేరును రక్షించాలంటే ఆకివీడులోని రైల్వే వంతెన సమీపంలో జువ్వ కనుమ వద్ద రెగ్యులేటర్‌ నిర్మించాలి. రెండు మూడు రెగ్యులేటర్ల నిర్మాణం వల్ల ఉపయోగం లేదు. సముద్రపు ఆటుపోట్లు ఉప్పుటేరు ద్వారా ప్రవహించాల్సి ఉంది. ఆ విధంగా జరిగినప్పుడే ఉప్పుటేరు, కొల్లేరు సంరక్షణ సాధ్యం  
సాక్షి : సరస్సు కాలుష్యాన్ని అరికట్టలేమా?
సూర్యనారాయణరాజు : సరస్సు కలుషితం కాకుండా ఉండేందుకు ఇంజినీర్‌ రామకృష్ణంరాజు సూచనలు పాటిస్తే బాగుంటుంది. కొల్లేరు చుట్టూ డ్రెయిన్లు తవ్వి, ఆ నీరు
ఉప్పుటేరులోకి చొచ్చుకుపోయేలా తప్పక చర్యలు తీసుకోవాలి. 
సాక్షి : ఇంకిపోతున్న కొల్లేరుకు పరిష్కారం?
సూర్యనారాయణరాజు : కొల్లేరు సరస్సులోకి కృష్ణా, గోదావరి నదుల నీరు వివిధ కాలువల ద్వారా చొచ్చుకువస్తుంది. పట్టిసం ఎత్తిపోతల పథకంతో కొల్లేరులోకి నీటిప్రవేశం తగ్గిపోయింది. కొల్లేరులోకి చొచ్చుకువచ్చే రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు తదితర పంట కాలువల ఇన్‌ఫ్లోలను అభివృద్ధిచేయాలి. 
సాక్షి : రెగ్యులేటర్ల నిర్మాణ ఆవశ్యకత ఎంత?
సూర్యనారాయణరాజు : కొల్లేరులో 5వ కాంటూర్‌ వరకూ నీరు నిలబడినప్పుడే సరస్సు ఉనికి ఉంటుంది. అందుకోసం ఆకివీడులోని రైల్వే వంతెన సమీపంలో జువ్వ కనుమ వద్ద రెగ్యులేటర్‌ నిర్మించాలి. దీనిద్వారా కొల్లేరులో నీటి మట్టం పెరిగి సరస్సులోకి పక్షుల రాకపోకలు పెరుగుతాయి. 
సాక్షి : కొల్లేరు పరిరక్షణకు శాశ్వత మార్గం?
సూర్యనారాయణరాజు : కాంటూర్‌ కుదింపు కొల్లేరు పరిరక్షణకు సరైన పరిష్కారం కానేకాదు. 5వ కాంటూర్‌ పరిధిలోని జిరాయితీ భూములకు నష్టపరిహారం ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుని ఆసియా ఖండంలోనే విశిష్టమైన మంచినీటి సరస్సును కాపాడుకోవాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top