నా భార్యను కాపాడండి 

Spandana Event In Vijayawada Collectorate - Sakshi

సాక్షి, విజయవాడ: పేదరికంతో మగ్గుతున్న కుటుంబాన్ని ఆసరాగా ఉందామనుకున్న భార్య కువైట్‌లో షేక్‌ల చేతిలో చిక్కుకుని విలవిలలాడుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె భర్త విజయవాడ సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి హాజరై తన భార్యను కాపాడమని వేడుకున్నారు. వివరాలు.. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలేనికి చెందిన కర్ర యాకోబు, భార్య క్రాంతికుమారి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో భీమవరానికి చెందిన యాళ్ల ప్రసాద్‌కుమార్‌ అనే ఏజెంట్‌ ద్వారా నాలుగేళ్ల క్రితం కాంత్రి కుమారి పని చేసేందుకు కువైట్‌ వెళ్లింది. ఆమె పాస్‌పోర్టు 2016 అక్టోబర్‌ 3తో గడువు ముగిసింది.

కువైట్‌లో క్రాంతికుమారికి పనిభారం ఎక్కువైంది. ఆరోగ్యం దెబ్బతింది. బీపీ, షుగర్‌ త్రీవస్థాయికి చేరాయి. కళ్లు తిరిగిపడిపోతున్నట్లు భర్తకు ఫోన్‌చేసింది. అలాంటి పరిస్థితుల్లో తనను ఇండియా పంపమని అక్కడి వాళ్లు పంపకుండా తినడానికి తిండి, కనీస సౌకర్యాలు (పేస్టు, సబ్బులు) కూడా కల్పించడం లేదంటూ యాకోబుకు తెలిపింది. కనీసం ఫోన్‌ కూడా మాట్లాడనీయకపోవడం లేదు. ఏజెంటును సంప్రదిస్తే.. తాము డిమాండ్‌ చేసిన డబ్బులు ఇస్తేనే తీసుకువస్తానని చెబుతున్నారు. చేతిలో తగిన డబ్బులు లేకపోవడంతో ఏమీ చేయాలో తెలియక యాకోబు విజయవాడ సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి తనకు న్యాయం చేయమని ఫిర్యాదు చేశారు. సమస్యను అర్థం చేసుకున్న ఇన్‌చార్జి ఆర్డీఓ చక్రపాణి వెంటనే విదేశీ మంత్రిత్వశాఖకు ట్విటర్‌ ద్వారా కాంత్రికుమారి ఇబ్బందులు తెలియచేశారు.

రైతు బజార్లలో దుకాణాలు కేటాయించండి: వికలాంగులు విన్నపం
తంగిరాల శ్రీనివాసశర్మ, జె.పాండురంగరావులతో పాటు మరో నలుగురు పటమట రైతు బజార్‌లో కూరగాయాల దుకాణాలు ఉండేవి. అయితే దీర్షకాలంగా అక్కడే ఉన్నారంటూ ఈ ఆరుగురులో  శ్రీనివాసశర్మకు పాయకాపురం, మిగిలిన ఐదుగుర్ని భవానీపురం బదిలీ చేశారు. వికలాంగులమైన తమను నగర శివారు ప్రాంతాల్లో రైతు బజార్‌లకు పంపిస్తే ఏ విధంగా జీవనం సాగిస్తామని వారు ఆవేదన చెందుతున్నారు. పటమట లేదా స్వరాజ్యమైదానంలో దుకాణాలు కేటాయించాలని కోరుతున్నారు. అలాగే గతంలో 3000 ఉన్న దుకాణం అద్దెను ఒక్కసారిగా రూ.9000కు పెంచేశారని వాపోయారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని న్యాయం చేయాలని స్పందనలో అధికారుల్ని కోరారు. 

768 ఫిర్యాదులు నమోదు....
విజయవాడ సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో  మొత్తం 768 దరఖాస్తులు అందాయి. ఇందులో భూ వివాదాలు ఇతర అంశాలకు సంబంధించిన 19 దరఖాస్తులు, రేషన్‌కార్డుల కోసం 127, పెన్షన్లు కోసం 41, ఇళ్లకోసం 501, శాంతిభద్రతలకు చెందిన సమస్యలు 4, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకోసం 55, ఇతర దరఖాస్తులు 21 వచ్చాయి. అవకాశం ఉన్నంత వరకు సమస్యలను అక్కడిక్కడే ఇన్‌చార్జి ఆర్డీఓ చక్రపాణి పరిష్కరించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top