జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరముందని వామపక్ష నాయకులు అభిప్రాయపడ్డారు.
అనంతపురం సెంట్రల్ : జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరముందని వామపక్ష నాయకులు అభిప్రాయపడ్డారు. నగరంలోని డీఆర్‌డీఏ అభ్యుదయహాలులో సీపీఎం ఆధ్వర్యంలో ‘జిల్లా అభివృద్ధికై సమాలోచనలు’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన వర్క్‌షాపు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఓబులు మాట్లాడుతూ.. జిల్లాలో నీటి సౌకర్యాలను, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాల్సిన అవసరముందన్నారు. వీటితో పాటు ఇక్కడున్న ఖనిజ సంపద ఆధారంగా ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు నెలకొల్పేలా ఒత్తిడి పెంచాల్సి ఉందన్నారు.
సీపీఐ సీనియర్ నేత ఎంవీ రమణ మాట్లాడుతూ.. జిల్లాలో అనేక ఏళ్లుగా కరువు నెలకొందన్నారు. దీన్ని శాశ్వతంగా రూపుమాపే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సీపీఐ ఎంఎల్ నాయకుడు పెద్దన్న మాట్లాడుతూ.. జిల్లాలో సమస్యలు శాశ్వతంగా పరిష్కారమై.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రజల్లో తిరుగుబాటు రావాల్సిన అవసరముందన్నారు. ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిపై ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరముందన్నారు.
ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేద్దామన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపడం వల్ల జిల్లా అన్ని రకాలుగా వెనుకబడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వామపక్ష పార్టీలు ఒకతాటిపైకి వచ్చి ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, అనంత సాగునీటి సాధన కమిటీ సభ్యులు బాషా, రామాంజనేయులు, నీటిపారుదలశాఖ ఇంజనీరు పాణ్యం సుబ్రమణ్యం, ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు నాగేశ్వరరావు, రామాంజనేయులు, న్యాయవాది నిర్మలమ్మ, డాక్టర్ ప్రగతి తదితరులు పాల్గొన్నారు.