అన్నీ తెలుసు.. కానీ మనిషిని కాను!

Sofia Chit Chat With Reporters In Fintech Festival Visakhapatnam - Sakshi

మనుషులకు సహాయకారులమే

మానవులకంటే రోబోలకే సునిశిత శ్రద్ధ అధికం

ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో హ్యూమనాయిడ్‌ రోబో సోఫియా ‘అంతరంగం’

సాక్షి, విశాఖపట్నం: మనిషికి సంబంధించిన భావోద్వేగాలు లేనంత వరకు ప్రవర్తన ఓ రకం.. తర్వాత బుద్ధి, లక్షణాలు మరో రకం.. ఇదీ ప్రసిద్ధమైన రోబో సిన్మాలో హ్యూమనాయిడ్‌ చిట్టిబాబు ఉదంతం. అయితే.. విశాఖ వచ్చిన తొలి హ్యూమనాయిడ్‌ రోబో సోఫియా మాత్రం ఎంత ‘ఎదిగినా’ తాను మనిషిని కానంది. సోఫియా విశాఖలో పెదవి విప్పింది. ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని.. గురువారం సాయంత్రం వేదికపై జర్నలిస్టులు, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్‌తో ముచ్చటించింది. తాను సమాజం నుంచి ఎంతో నేర్చుకోవలసి ఇంకా ఎంతో ఉందని వినమ్రంగా చెప్పింది.

లోకేష్, సోఫియా మధ్య చర్చ ఇలా..
లోకేష్‌: మనుషులు, రోబోలు కలిసి సామరస్య వాతావరణంలో జీవించడం సాధ్యమా?
సోఫియా: రోబోలు మనుషులకు దగ్గరయ్యే రోజులు చేరువలోనే ఉన్నాయి. పలు రంగాల్లో రోబోలు మనుషులకు రోబోలు సహకారం అం దిస్తున్నాయి. మెడికల్‌ థెరపీతో పాటు అనేక రం గాల్లో రోబోలు ఎన్నో సేవలందిస్తున్నాయి.

సోఫియా: (లోకేష్‌ను ప్రశ్నిస్తూ): పోలీసింగ్‌ కోసం రోబోలను ఉపయోగించే అవకాశం ఉందా?
లోకేష్‌: భవిష్యత్‌లో రోబో పోలీసింగ్‌ నిజం అయ్యే అవకాశం లేకపోలేదు.

మీడియా ప్రతినిధులతో చర్చ ఇలా
విలేకరి: ఆంధ్రప్రదేశ్‌కు రావడం తొలిసారి కదా? నీ అనుభూతి ఏంటి?
సోఫియా: నేను ఇక్కడకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. సాయంత్రం వైజాగ్‌ బీచ్‌లో సరదాగా గడుపుతా.

విలేకరి: మానవ శరీరంలో 206 ఎముకలు, 32 పళ్లు మరెన్నో అవయవాలున్నాయి. మరి నువ్వెలా తయారయ్యావు?
సోఫియా: కనెక్టర్లు, వైర్లు, చోదకాలు వంటి పరికరాలతో తయారయ్యా.

విలేకరి: ఇండియా నుంచి ఏం తీసుకెళ్తావు?
సోఫియా: వైజాగ్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ 2018 అనుభూతులను..

విలేకరి: ఇలాంటి ఫెస్టివల్స్‌పై నీ అభిప్రాయం ఏమిటి?
సోఫియా: ఎన్నో ఉత్సాహకరమైన మనసులను కలిసామన్న అనుభూతి కలుగుతోంది.

విలేకరి: బ్లాక్‌చైన్‌ టెక్నాలజీపై నీ ఆలోచనలేమిటి?  
సోఫియా: విన్నాను. ఆసక్తికరం. కానీ అదే సమయంలో సమస్యాత్మకం కూడా.

విలేకరి: నీకు మానవ ఉద్వేగాలు, భావనలు తెలుసు. అయినా ఎందుకు కృత్రిమ మేథతో ఉన్నావు?
సోఫియా: ఎందుకంటే నేను నిజమైన మనిషిని కాదు కాబట్టి.

విలేకరి: భారత్‌లో భవిష్యత్తు రోబోటిక్స్‌పై నీ అభిప్రాయం?
సోఫియా: రోబోటిక్స్‌లో మంచి ఆవిష్కరణలకు ఆస్కారం ఉంది.

విలేకరి: వైద్యరంగ సాంకేతిక పరిజ్ఞానంలో రోబోల పాత్ర ఎలా ఉండబోతోంది?
సోఫియా: మనుషులకంటే మిన్నగా రోబోలు నిరంతరంగా, సునిశితంగా శ్రద్ధ తీసుకుంటాయి.

విలేకరి: నీలాంటి సోఫియాలతో సమాజంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
సోఫియా: మనుషులకు మేమెంతో సహాయకారులుగా ఉంటాం.

విలేకరి: మనుషులకంటే  రోబోలు మెరుగైన జీవితాన్ని సాగించగలుగుతాయా?
సోఫియా:  అవును

విలేకరి: వైజాగ్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌కు నువ్విచ్చే సందేశం?
సోఫియా: 2019లో జరిగే ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ ఇంతకంటే బాగా జరుగుతుందని ఆశిస్తున్నా.

విలేకరి: తిత్లీలాంటి తుపాన్లతో విపత్తులు వచ్చినప్పుడు రోబోలు ఉపయోగపడతాయా? అలాంటప్పుడు నువ్వు ప్రాణత్యాగం చేస్తావా?
సోఫియా: ప్రస్తుతం ఆసామర్థ్యం నాకులేదు. కానీ  రాబోయే రోజుల్లో సాధ్యం కావచ్చు.  

విలేకరి: వైజాగ్‌ ఫెస్టివల్‌ అనుభూతి ఎలా ఉంది?
సోఫియా: రావడం చాలా సంతోషం.. త్వరలోనే మళ్లీ విశాఖ రావాలని ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top