అంతా స్కెచ్‌ ప్రకారమే..

Sit Officers Neglecting Murder Attempt on YS Jagan - Sakshi

నీరుగారుతున్న సిట్‌ విచారణ

మొక్కుబడిగా కస్టడీ పిటిషన్‌

సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ పెద్దల చేతిలో పావుగా మారిన ఆ యువకుడు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడ్ని అడ్డుతొలగించే లక్ష్యంతో పక్కా వ్యూహంతో  హత్యా యత్నానికి ఒడిగట్టాడు. ఇప్పుడు అదే ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు పక్కా ప్రణాళికతో ఆ కేసును ఏ విధంగా నీరుగార్చాలా అని విచారణాధికారులు శోధిస్తున్నట్టుగా కన్పిస్తోంది. సంచలనం రేపిన ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగి అప్పుడే పక్షం రోజులు గడిచిపోయింది. ఎయిర్‌పోర్టులో ఉన్న వందల కెమెరాల్లోని సీసీ పుటేజ్‌లను విశ్లేషించారు. పదివేలకు పైగా కాల్‌డేటా ఉందని చెప్పుకొచ్చిన అధికారులు ఘటనకు ముందు నెల రోజుల్లో నిందితుడు మాట్లాడిన 321 మందిని ఆరా తీశారు. నిందితునితో నేరుగా సంబంధం ఉందని భావించిన 72 మందిని వివిధ కోణాల్లో గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. ఇక నిందితుడ్ని ఆరు రోజుల కస్టడీలో విభిన్న కోణాల్లో విచారించారు. స్టేషన్లు మార్చి మరీ తమదైన శైలిలో సామధానబేధ దండోపాయాలను ప్రయోగించి మరీ నిజాలను రాబట్టే ప్రయత్నం చేశారు. ఎంతగా ఒత్తిడిచేసినా ‘అంతా లేఖలో ఉంది..నేను చెప్పాల్సింది చెప్పేశా.. నా దగ్గర చెప్పడానికేమి లేదని నిందుతుడు బదులిచ్చే వాడని కస్టడీ సమయంలో సిట్‌ అధికారులు చెప్పుకొచ్చేవారు. తాజాగా నిందితునిపై ఏమైనా కేసులు ఉన్నాయా..? అతని నడవడిక, పనితీరు, వ్యవహార శైలి ఎలా ఉందో అధ్యయనానికి అతడు పనిచేసిన హైదరాబాద్, బళ్లారి, గోవా, రాజమండ్రి, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అతని స్నేహితులను ఆరా తీసేందుకు మధ్య ప్రదేశ్, ఒడిశాలకు కూడా ప్రత్యేక బృందాలను పంపారు.

కానీ కేసు పురోగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే చందంగాతయారైంది. కస్టడీ సమయంలో ప్రతి రోజు కేసు పురోగతిని మీడియాకు వివరించేవారు. కస్టడీకి అప్పగించిన 2వ తేదీ నుంచి నేటి వరకు విచారణ సాగుతున్న తీరును వివరించేందుకు సీపీ, డీసీపీలు కాదు కదా కనీసం సిట్‌ అధికారులు కూడా మీడియా ముందుకు రావడంలేదు. ఎవర్ని కదిపినా హైప్రొఫైల్‌ కేసు కదా..విచారణలో ఉన్నప్పుడు మాట్లాడకూడదంటూ  సమాధానాలు దాటవేస్తున్నారు. అలాంటప్పుడు కస్టడీ సమయంలో ఎందుకు చెప్పారంటే మాత్రం సమాధానం లేదు. కస్టడీ సమయంలో నిందితుడు చెప్పినట్టుగానే కేసు పురోగతిపై ఎంతగా గుచ్చిగుచ్చి ప్రశ్నించినా..‘విచారణలో ఉంది..అంతా చార్జిషీట్‌లో చెబుతాం. తెరపై చూసుకోండ’ంటూ సిట్‌ అధికారులు బదులిస్తున్నారు. కస్టడీ చివరి రోజు నుంచి నేటివరకు ఈ కేసులో ఒక్కరంటే ఒక్కర్ని కూడా సిట్‌ కార్యాలయంలో విచారించిన పాపాన పోలేదు. కస్టడీ ముగిసే నాటికి 52 మందిని విచారించినట్టుగా చెప్పిన సిట్‌ అధికారులు తాజాగా ఆ సంఖ్య 72కు పెంచేశారు. కానీ వారి వివరాలు  చెప్పేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు. కస్టడీ సమయంలో హైడ్రామాలాడిన సిట్‌ అధికారులు ఆ తర్వాత నాన్‌ సీరియస్‌గా తీసుకున్నారని విచారణ సాగుతున్న తీరును బట్టి ఇట్టే అర్థమవుతోంది. సీపీ, డీసీపీలు సిట్‌ వైపు కన్నెత్తి చూడడం లేదు. చివరకు సిట్‌లో కిందస్థాయి అధికారులు కూడా ఎప్పుడొస్తున్నారో.. ఏమీ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. నాన్‌ సీరియస్‌గా వేయడం వలనే కస్టడీ పొడిగింపు పిటిషన్‌ను కోర్టు డిస్మస్‌ చేసిందని న్యాయనిపుణులంటున్నారు.

ఆషామాషీగా కాదు
మరో వైపు జననేతపై హత్యాయత్నం ఆషామాషీగా జరగలేదని..అంతా పక్కా వ్యూహం ప్రకారమే జరిగిందని ఓ రిటైర్డ్‌ పోలీస్‌ ఉన్నతాధికారి విశ్లేషిస్తున్నారు. విచారణ సాగు తున్న తీరును చూస్తుంటే నిందితుడు చెబుతున్న మాటలనే నిజం చేస్తూ అతను వైఎస్సార్‌సీపీకీ వీరాభిమానిగా..అతని రాసిన లేఖను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సన్సేషన్‌ కోసమే ఈ దుశ్సాహాసానికి ఒడిగట్టాడంటూ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల మేరకు సిట్‌ అధికారులు ఈ కేసును చాపచుట్టేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ అధికారి చెప్పుకొచ్చారు. నిజంగా వీరాభిమానే అయితే నిందితుడి సొంత జిల్లా తూర్పు గోదావరిలో 63 రోజుల పాటు ప్రజాసంకల్పయాత్ర సాగింది. సొంత నియోజకవర్గ మైన ముమ్మిడివరంలో పదిరోజులకు పైగా పాదయాత్ర సాగింది. నిజంగా అభిమానే అయితే ఆ సమయంలోనే సెల్ఫీ కోసం ప్రయత్నించే వాడు. పోనీ అక్కడ కుదరలేదనుకుంటే విశాఖలో ప్రజాసంకల్పయాత్ర మొదలైనప్పటి నుంచి జననేత విశాఖ ఎయిర్‌ పోర్టు మీదుగానే ఆయన రాకపోకలు సాగిస్తున్నారు.

కనీసం రెండు నెలల పాటు ప్రతి వారం వస్తూ పోతున్నా ఏనాడు జగన్‌ మోహన్‌రెడ్డిని కలిసి రాసిన లేఖ ఇచ్చేందుకు కానీ, సెల్ఫీ కోసం కానీ కనీసంగా కూడా ప్రయత్నించిన పాపానపోలేదు. ముమ్మిడి వరంలో కానీ తూర్పుగోదావరిలో కానీ వైఎస్సార్‌సీపీ జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులకు శ్రీనివాస్‌ ఎవరో తెలియదు.ఏనాడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు కూడా లేవు. సడన్‌గా తెరపైకి వచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టడం చూస్తుంటే ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందనిపిస్తుందని, ఆ కోణంలో ఎందుకు సిట్‌ అధికారులు విచారణ సాగించడంలేదో నాకైతే అర్థం కావడం లేదని ఆ అధికారి అభిప్రాయ పడుతున్నారు. ఫ్లెక్సీ ఏర్పాటు, జేబులో పెట్టుకున్నట్టుగా చెబుతున్న లేఖలు చూస్తుంటే పథకంలో భాగమేనని ఎవరిని అడిగినా అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. విచారణ సాగుతున్న తీరు చూస్తుంటే అంతా పోలీస్‌ బాస్‌ స్క్రిప్ట్‌ ప్రకారమే జరుగుతుందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top