నూతన రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో గురువారం సింగపూర్ బృందం పర్యటించింది.
తుళ్ళూరు (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో గురువారం సింగపూర్ బృందం పర్యటించింది. సెంటర్ ఫర్ లైయబిలిటీ సిటీ అసిస్టెంట్ డెరైక్టర్ జేమ్స్‌ధాయ్తో పాటు మరో 12మంది సభ్యుల బృందం తుళ్ళూరు మండలంలోని కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని గ్రామాలు ,లంకలలో పర్యటించింది.
ముందుగా మంగళగిరి మండలం నీరుకొండ వద్ద కొండవీటివాగు ముంపు ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన బృందం అక్కడి నుంచి తుళ్ళూరు మండలంలోని వెలగపూడి వద్దకు చేరుకున్నారు.అక్కడ హై పవర్ విద్యుత్ టవర్లను పరిశీలించారు. తమవద్ద ఉన్న మ్యాప్‌ల ఆధారంగా విద్యుత్ లైన్లను పరిశీలించి రాజధాని నిర్మాణానికి విద్యుత్ టవర్ల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయా అన్న విషయమై విద్యుత్ శాఖాధికారులతో మాట్లాడారు.
సింగపూర్ రాజధాని ప్రాంతంలో ఉన్న విద్యుత్ టవర్లను దృష్టిలో పెట్టుకొని సీడ్ కాపిటల్‌కు సంబంధించిన ప్రణాళికను రూపొందించాలని చేసిన ప్రతిపాదనల నేపధ్యంలో ఈ అంశంపై సింగపూర్ బృందం ప్రత్యేకదృష్టి సారించింది. అనంతరం ఉద్దండ్రాయునిపాలెం కరకట్ట వరకు వాహనాలలో వెళ్ళిన బృందం అక్కడ నుంచి కాలి నడకన లంకలోకి వెళ్ళి తమ దగ్గర ఉన్న మ్యాప్‌ల ఆధారంగా అక్కడి పరిస్థితులపై ఒక అంచనాకొచ్చారు. కరకట్టకు కృష్ణా నదికి మద్య ఉన్న దూరాన్ని నమోదు చేసుకున్నారు.
లంక నుంచి కొద్ది దూరంలో ఉన్న కృష్ణానది దగ్గరకు వెళ్ళారు. అక్కడి నుంచి బయలుదేరి లింగాయపాలెం మీదుగా రాయపూడి లాంచీ రేవు వద్దకు చేరుకున్నారు. సీడ్ కాపిటల్ మాస్టర్‌ప్లాన్ కూడా కొద్దిరోజుల్లో సింగపూర్ ప్రభుత్వం అందించనున్న నేపధ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సింగపూర్‌బృందం వెంట విద్యుత్‌శాఖ, నీటి పారుదలశాఖలకు చెందిన అధికారులతోపాటు సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు.