స్టాంపులు దొరకట్లేదు! 

Shortage of Rs 50 and Rs100 Non Judicial Stamps - Sakshi

రూ. 50, 100ల నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపుల కొరత

స్థిరాస్తి కొనుగోలు, ఒప్పందాలు చేసుకునే వారికి చిక్కులు 

నోటరీ, ఇతర అవసరాలకు అవస్థలు

గత సర్కారు బకాయిలు చెల్లించక పోవడంవల్లే సమస్య  

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపులకు కొరత ఏర్పడింది. రూ. 50, 100 విలువైన స్టాంపులు చాలా చోట్ల దొరకడంలేదు. దీనివల్ల స్థిరాస్తుల కొనుగోలు ఒప్పందాలు, ఎంవోయూలు, వివిధ ధ్రువీకరణ, అఫిడవిట్‌లు, నోటరీలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొరతవల్ల బైట ఎక్కువ ధరకు కొనాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిక్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి ఈ స్టాంపులు తెచ్చుకోవాలని, అయితే ఆ సంస్థకు గత సర్కారు రూ. 17 కోట్ల బకాయి పడినందున సమస్య ఏర్పడిందని సమాచారం. పరిస్థితిని గమనించిన ప్రస్తుత ప్రభుత్వం ఆ సంస్థకు బకాయిలు విడుదల చేయడంతోపాటు రూ. 115 కోట్లకు స్టాంపులకు ఇండెంట్‌  పంపించారు.  

ప్రత్యామ్నాయ మార్గాలున్నా.... 
గతంలో స్థిరాస్తుల కొనుగోలు, తనఖా ఒప్పందాలకు ఎంత రుసుమైతే అంత చెల్లించి స్టాంపులు కొనుగోలు చేసి దస్తావేజులను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి వచ్చేది. కాలక్రమంలో స్టాంపుల బదులు ఆన్‌లైన్‌లోనూ, బ్యాంకుల్లో చలానా రూపంలో రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించి రూ. 100ల స్టాంప్‌ పేపర్‌పై దస్తావేజు (మొదటి పేజీ) రాయించుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.  ఫీజు మొత్తం చెల్లించి తెల్లకాగితాలపై ఫ్రాంక్లిన్‌ మిషన్‌తో ముద్రలు కూడా  వేయించుకోవచ్చు. అయితే స్టాంపు పేపర్లపై దస్తావేజులను రిజిస్ట్రేషన్‌  చేసుకున్న వాటికే చట్టబద్ధత, భద్రత ఉంటుందనే అపోహ  ప్రజల్లో ఉంది. దాంతో ఎక్కువ మంది రూ. 100ల స్టాంప్‌ పేపర్‌పైనే దస్తావేజులు రాయించుకుంటున్నారు. దాంతో వీటికి 
డిమాండ్‌ ఉంది. 

కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు : ఐజీ 
స్టాంపుల కొరత లేకపోయినా ఉన్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ సిద్ధార్థ జైన్‌ పేర్కొన్నారు. ఎక్కడో కొన్ని సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల్లో కొరత ఉంటే జిల్లాలోని ఇతర ఆఫీసుల నుంచి పంపించే ఏర్పాటు చేశామని, ఎక్కడా కొరత లేకుండా సర్దుబాటు చేయాలని డీఐజీలకు ఆదేశాలు జారీ చేశామని ఆయన ’సాక్షి’కి  తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించాలని ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ రకాల స్టాంపులు మొత్తం 2.08 కోట్లు ఉన్నాయని,  వీటి విలువ రూ. 56.50 కోట్లని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top