
తల్లడిల్లిన అభిమానులు
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి (43) మరణించిన విషయం తెలిసి పార్టీ నాయకులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి (43) మరణించిన విషయం తెలిసి పార్టీ నాయకులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. నేత్రదానం చేయనున్నట్లు గతంలోనే శోభా నాగిరెడ్డి ప్రమాణపత్రం రాసి ఇవ్వడంతో ఆమె నేత్రాలను తీసి మరో ఇద్దరికి అమరుస్తారు. శుక్రవారం మధ్యాహ్నం ఆళ్లగడ్డలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని వైఎస్ఆర్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ విజయమ్మ తన ప్రచారాన్ని ఆపి, హుటాహుటిన రాజమండ్రి నుంచి విమానంలో బయల్దేరి హైదరాబాద్ కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు.
బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైన శోభా నాగిరెడ్డి.. దాదాపు 12 గంటల పాటు మృత్యువుతో పోరాడి, చివరకు ఓడిపోయారు. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న ఎంతోమందిని కాపాడి.. ప్రాణాలు పోసిన అత్యంత నిపుణులైన కేర్ ఆస్పత్రి వైద్యులు ఎంతగా ప్రయత్నించినా, గాయాల తీవ్రత అత్యంత ఎక్కువగా ఉండటం, ఆమె శరీరం కూడా చికిత్సకు ఏమాత్రం స్పందించలేదు. అన్ని రకాలుగా ప్రయత్నించిన తర్వాత ఇక ఫలితం లేకపోవడంతో ఆమె మరణించినట్లు కేర్ ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
బుధవారం రాత్రి తన నియోజకవర్గంలో ప్రచారం ముగించుకుని, తిరిగి ఇంటికి వెళ్తుండగా వేగంగా వెళ్తున్న వాహనం ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో నాలుగు పల్టీలు కొట్టని తర్వాత ఆమె వెన్నెముక, పక్కటెములకు తీవ్రగాయాలు కావడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. మెదడుకు సైతం గాయాలు కావడంతో ఆమె ముక్కు, చెవుల్లోంచి కూడా రక్తస్రావం అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
శోభా నాగిరెడ్డి ఇక లేరన్న విషయాన్ని కేవలం కర్నూలు జిల్లా వాసులు మాత్రమే కాదు.. యావత్ ఆంధ్రదేశ ప్రజలు తల్లడిల్లిపోయారు. ఏ సమయంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించే నాయకురాలు ఇక తమకు లేరని తెలిసి అభిమానులు తట్టుకోలేకపోయారు. కేర్ ఆస్పత్రి ప్రాంగణం మొత్తం ఆమె అభిమానులతో కిటకిటలాడింది.