
బడిబాట ఆలస్యం
బడి గంట మోగేందుకు సమయం ఆసన్నమైంది. మూడు రోజుల్లో పాఠశాలలు తెరవనున్నారు.
మన్యంలో డ్రాపౌట్స్ సంఖ్య 6,200
వారిని బడిలో చేర్పించాలని పీవో ఆదేశం..
కొయ్యూరు : బడి గంట మోగేందుకు సమయం ఆసన్నమైంది. మూడు రోజుల్లో పాఠశాలలు తెరవనున్నారు. ప్రతి ఏటా అధికారులు, ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించి, తల్లిదండ్రులను అవగాహన పరిచి చిన్నారులను పాఠశాలలో చేర్పిస్తుంటారు. గత ఏడాది డ్రాపౌట్స్‌గా ఉన్న వారిని గుర్తించి వారిని మరలా పాఠశాలలో చేర్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అయితే ఈ ఏడాది బడిబాట ఇంతవరకు ప్రారంభం కాలేదు. మన్యంలో అధికారుల లెక్కల ప్రకారం గత ఏడాది పాఠశాలకు ఎక్కువ రోజులు రాకుండా ఇంటి వద్దనే ఉండిపోయిన విద్యార్థుల సంఖ్య 6,200. పాఠశాలలు తెరిచే నాటికి వీరందరిని తిరిగి చేర్పించాలని ఐటీడీఏ పీవో హరినారాయన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ బాధ్యతను ఎంఈవోలు, ఏటీడబ్ల్యూవోలకు అప్పగించారు. ఉన్న తక్కువ సమయంలో అంత మంది విద్యార్థులకు పాఠశాలల్లో చేర్పించడం సాధ్యమేనా..?
ప్రతి ఏడాది ప్రభుత్వం పాఠశాల ప్రారంభానికి ముందే బడిబాట నిర్వహిస్తుంది. అయితే ఈ ఏడాది ఆలస్యంగా 15 నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. గత విద్యాసంవత్సరంలో డ్రాపౌట్స్‌ను తిరిగి బడిలోని చేర్పించడం, కొత్త అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులు గ్రామ బాట పడతారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. డ్రాపౌట్స్ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి మరలా బడికి పంపేలా చర్యలు తీసుకుంటారు. అయినా డ్రాపౌట్స్ సంఖ్య తగ్గడం లేదు. బడికి రాకుండా ఇంటి వద్దనే ఉన్న విద్యార్థులు 6,200 అని అధికారులు లెక్కగట్టారు. వీరిని మూడు రోజుల్లో బడిలో చేర్చడం సాధ్యం కాదని ఇటు ఉపాధ్యాయులు అంటున్నారు. వీరిలో ఎక్కువ మంది మారుమూల ప్రాంతాలకు చెందిన వారు కావడంతో వారిని తీసుకురావడం ఇబ్బందిగానే ఉంటుంది. మన్యంలో అక్షరాస్యత పెరగాలంటే ముందుగా చిన్నారుల త ల్లిదండ్రులల్లో అవగాహన రావాలి. వారితో పనులు చేయించకుండా బడికి పంపించాలి.. అప్పుడే కొంత వరకు ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుంది.