ఫేస్‌బుక్కయ్యాడు! | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్కయ్యాడు!

Published Thu, Jul 27 2017 3:13 AM

Santosh Kumar is a cyber criminal

పాతపట్నం: ఫెస్‌బుక్‌ అకౌంట్‌లో అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన యువకుడు పుట్టా సంతోష్‌ కుమార్‌ను సైబర్‌ నేరం కింద అరెస్టు చేశామని పాతపట్నం సీఐ బీవీవీ ప్రకాష్‌ తెలిపారు. బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ పాతపట్నం దేవాంగులవీదికి చెందిన అంకడాల సతీష్‌ కుమార్‌తో ఇదే పట్టణానికి చెందిన సింగుపురం సంతోషి అనే అమ్మాయితో పెళ్లి సంబందం కుదిరింది. ఆ అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్‌వెర్‌ కంపెనీలో పనిచేస్తుంది. ఆ అమ్మాయితో అనపర్తికి చెందిన సంతోష్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది.

 అయితే సతీష్‌ కుమార్‌తో సంబంధం కుదిరిందని తెలుసుకున్న సంతోష్‌కుమార్‌ 2017 జనవరిలో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లు ప్రారంభించి, పాతపట్నంలోని పలువురుకు తనఫొటో, సంతోషి ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెట్టి అందరికీ పోస్టు చేశాడు. దాంతో సతీష్‌కుమార్, సంతోషిల పెళ్లి ఆగిపోయింది. వెంటనే ఆ అమ్మాయి హైదరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో సంతోష్‌కుమార్‌పై ఫిర్యాదు చేసింది. సైబర్‌ నేరం కింద జనవరిలో హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. తరువాత సంతోష్‌కుమార్‌  అంకడాల సతీష్‌ కుమార్‌ పేరు మీద ఫెస్‌బుక్‌లో అకౌంట్‌లు ప్రారంభించి అసభ్యకరమైన పోస్టింగులు అందరికీ పెడుతున్నాడు.

 దానిపై సతీష్‌ కుమార్‌ పాతపట్నం పోలీసు స్టేషన్‌లో జూన్‌ నెలలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు  ప్రారంభించారు. ఎస్‌ఐ.ఎం.హరికృష్ణ పోలీసు బృందంతో కలిసి అనపర్తికి చెందిన సంతోష్‌ కుమార్‌ను పట్టుకుని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ నేరంలో సైబర్‌ నేరం కింద మొదటి కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఎస్‌ఐతో పాటు క్రైం పోలీసులు ఎ.మాధవరావు, పి.మాధవరావు, సీహెచ్‌.హరీష్‌లను సీఐ ప్రకాష్‌ అభినందించారు.

Advertisement
Advertisement