పదింతలు దోచేద్దాం

Sand Illegal Transportation In Eluru - Sakshi

కొత్త ఇసుక పాలసీ మరో పదిరోజుల్లో అమలులోకి రానున్న నేపథ్యంలో ఈలోపే పదింతలు దోచుకునేందుకు ఇసుకమాఫియా యత్నిస్తోంది. దీనికి రెవెన్యూ, పోలీసు అధికారులు హకరిస్తున్నారు. ప్రభుత్వ పనుల కోసం కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాలను అడ్డం పెట్టుకుని నిబంధనలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రతి లారీకి ఒక స్లిప్‌ ఇచ్చి అది వెళ్లిన సమయం నోట్‌ చేయాల్సి ఉండగా దానికి భిన్నంగా ఒకే స్లిప్‌పై పది నుంచి 11 లారీల నంబర్లు వేసి 30 నుంచి 36 యూనిట్ల ఇసుక పంపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కొవ్వూరు తహసీల్దార్‌ సంతకంతో ఉన్న స్లిప్‌ కలకలం రేపుతోంది. 

సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : కాకినాడ వద్ద రైల్వే కాంట్రాక్టర్‌కు సుమారు 300 యూనిట్ల వరకూ ఇసుకను దఫదఫాలుగా ఇవ్వడానికి కలెక్టర్‌ నుంచి అనుమతి వచ్చింది. ఇసుకను తరలించేటప్పుడు ఒక్కో స్లిప్‌పై లారీ నంబర్, ఎన్ని యూనిట్లు ఇసుక తరలిస్తున్నది, ఎన్ని గంట లకు లారీ  రీచ్‌లోకి వచ్చింది. ఎన్ని గంటలకు వెళ్లింది.. అనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఇవేమీ లేకుండానే ఇసుక అక్రమంగా తరలిపోయింది. కొవ్వూరులోని ఔరంగాబాద్, వాడపల్లి ర్యాంపుల  నుంచి పెద్ద ఎత్తున ఇసుక రియల్‌ ఎస్టేట్‌ నిర్వాహకులకు తరలించినట్లు సమాచారం. ఒకే స్లిప్‌పై పది లారీల నంబర్లు వేయడంతో ఏ లారీ ఎప్పుడు వెళ్తుంది? ఎప్పుడు వస్తుందన్న సమాచారం లేకుండా పోయింది. దీంతో ఒకే స్లిప్‌పై రోజుకు రెండు మూడు ట్రిప్పుల ఇసుకను తరలించి నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాకినాడకు తరలించాల్సిన ఇసుక రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లోని భవన నిర్మాణాలకు తరలించి నట్లు సమాచారం. 11 లారీలలో 30 యూనిట్లు తరలించినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు.

అయితే అందులో చూపించిన లారీల నంబర్ల ఆధారంగా ఆరా తీస్తే అవి 10 టిప్పర్లుగా తెలుస్తోంది. వీటిలో ఒక్కోదానిలో ఐదు నుంచి ఏడు యూనిట్ల వరకూ ఇసుకను రవాణా చేసే సామర్థ్యం ఉంది.  దీన్నిబట్టి చూస్తే ఒక్క ట్రిప్‌లోనే 50 నుంచి 70 యూనిట్ల వరకూ తరలిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అదే రాజమండ్రి రూరల్‌లో ఉన్న ఇసుక రీచ్‌లో వాహనం నంబర్, అది ఏ కేటగిరిలో ఉంది, రోడ్డు చార్జీలు ఎంత, ఏ సమయానికి ఆ వాహనం వెళ్లింది అన్న వివరాలతో స్లిప్‌ ఇస్తున్నారు. కొవ్వూరు మండలంలో మాత్రం దీనికి భిన్నంగా ఇసుక రవాణా చేసేస్తున్నారు.  ఒక్కో యూనిట్‌కు లోడింగ్‌ చార్జీలతో కలిపి ప్రభుత్వం రూ.800 ధర నిర్ణయించగా, అక్రమంగా తరలించిన ఇసుకకు యూనిట్‌ రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల  వరకూ వసూలు చేసినట్లు సమాచారం. ఇక్కడ ర్యాంపులో ఉన్న వీఆర్‌ఏ నుంచి మండలస్థాయి అధికారుల వరకూ ఈ వ్యవహరంలో పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి. దీనిపై  కలెక్టర్‌ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top