గోదారమ్మ ముద్దుబిడ్డలాంటి ఈ గడ్డపై మహాపర్వానికి సర్కారు నగారా మోగించింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు
సాక్షి, రాజమండ్రి :గోదారమ్మ ముద్దుబిడ్డలాంటి ఈ గడ్డపై మహాపర్వానికి సర్కారు నగారా మోగించింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో వచ్చే ఏడాది జరిగే పుష్కరాలకు తేదీలు ఖరారు చేయడంతో పాటు ఇవ్వబోయే నిధుల గురించి ప్రకటన చేయడంతో ఈ దిశగా తొలి అడుగు పడినట్టయింది. తొలుత.. కొండంత అవసరానికి పిడికెడు నిధులే ఇస్తామన్న సర్కారు.. చివరకు ఈ సీమకు పెన్నిధి వంటి జీవనది పట్ల కృతజ్ఞతకు, ఈ జాతి సంస్కృతికి ప్రతీక వంటి ఈ పర్వానికి మొత్తం రూ.900 కోట్లను వెచ్చించనున్నట్టు ప్రకటించింది. ఈ మొత్తంలో రూ.600 కోట్లు కేందం నుంచి రాబట్టనున్నట్టు తెలిపింది. ఏదేమైనా మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాల ప్రకారం తొట్టతొలుతగా దేవాదాయ శాఖకు విడుదలయ్యే రూ.8 కోట్లతో డిసెంబర్‌లో పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
ఓం ప్రథమంగా ఏ పనులను, ఎక్కడ మొదలు పెట్టాలి అన్నదానిపై అధికారులు
కసరత్తు ప్రారంభించారు. కాగా కేంద్రం అనుకున్నట్టు నిధులిస్తే.. రూ.900 కోట్లలో రూ.600 కోట్లు తూర్పున, రూ.300 కోట్లు పశ్చిమ న పుష్కర సన్నాహాలకు ఖర్చు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా రాష్ట్రం ఇచ్చే ని ధుల్లో అధికభాగం దేవాదాయ శాఖ నుంచి స మీకరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ శాఖ కమిషనర్ రెండు జి ల్లాల్లోని దేవాలయాలను సందర్శించి, వాటి ఆ దాయాలను పరిశీలించారు. ఎక్కువ రాబడి గ ల ఆలయాల నిధులతో జీర్ణాలయాలు, ఆదా యం తక్కువ ఆలయాల్లో పుష్కర పనులు చేసే ప్రతిపాదననూ ఉపసంఘం పరిశీలించింది.
సింహభాగం సొంత నిధులే..
కాగా పుష్కరాల్లో కీలకమైన పనులు ఆర్‌అండ్ బీ, దేవాదాయ, ఇరిగేషన్ శాఖలతో పాటు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టనున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్ రూ.30 కోట్లు, ఇరిగేషన్ శాఖ రూ.45 కోట్లు, ఆర్‌అండ్‌బీ రూ.75 కోట్లు, దేవాదాయ శాఖ రూ.30 కోట్లతో ప్రతిపాదనలు అందించాయి. ఇవే కాక పలు అనుబంధ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీంతో ఆయా శాఖల సొంత నిధులను కూడా పుష్కర పనులకు వెచ్చించేలా చూసి, పెద్ద మొత్తంలో పనులు చేశామని చెప్పుకోవాలన్న సర్కారు యోచన అంటున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో గోదావరి తీరంలో 245 ఘాట్‌లు ఉండగా వీటిలో 145 తూర్పుగోదావరిలో ఉన్నాయి. వీటిలో చాలా వాటిని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. దీంతో ముందుగా ఘాట్‌ల అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. తదనుగుణంగా అన్ని ఘాట్లనూ అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు చెప్పారు.
పర్వం ప్రారంభం జూలై 14న..
గోదావరి పుష్కరాల ప్రారంభం ఎప్పుడన్న దానిపై సిద్ధాంతకర్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా చివరికి వచ్చే ఏడాది జూలై 14న ప్రారంభమవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పుష్కర ప్రారంభం ఎప్పుడన్న దానిపై ప్రభుత్వం తొలుత పండితుల అభిప్రాయాలు కోరింది. జ్యోతిష విజ్ఞాన భాస్కర మధుర కృష్ణమూర్తి శాస్త్రి జూన్ 28న, శ్రీశైలం ఆస్థాన విద్వాంసుడు బుట్టే వీరభద్ర దైవజ్ఞ జూలై ఏడున పుష్కర ప్రారంభమని చెప్పగా తం గిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్ధాంతి జూలై 14నే సూచించారు. చివరికి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగాన్ని ప్రామాణికంగా తీసుకుని జూలై 14న ఉదయం 6.28 గంటలకు పుష్కరాల ప్రారంభానికి ముహూర్తంగా ఖరారు చేసింది. 14 నుంచి 25 వరకూ పుష్కరాలు జరుగుతాయని ప్రకటించింది.