రైతు నెత్తిన రాయితీ | Rs .31.36 crore in four years | Sakshi
Sakshi News home page

రైతు నెత్తిన రాయితీ

Jun 2 2015 2:16 AM | Updated on Oct 1 2018 2:00 PM

రైతు నెత్తిన రాయితీ - Sakshi

రైతు నెత్తిన రాయితీ

ప్రయివేటు సంస్థలకు ఎర్ర తివాచీ పరచి ఇబ్బడిముబ్బడిగా రాయితీలను అందిస్తున్న ప్రభుత్వం కరువురైతుల కోసం...

 బి.కొత్తకోట : ప్రయివేటు సంస్థలకు ఎర్ర తివాచీ పరచి ఇబ్బడిముబ్బడిగా రాయితీలను అందిస్తున్న ప్రభుత్వం కరువురైతుల కోసం కొద్దిపాటి రాయితీని భరించలేని దుస్థితిలో ఉంది. పంటలు పెట్టి వందలకోట్ల పెట్టుబడులను కోల్పోతున్న రైతులకు ఏటా ఖరీఫ్‌లో పంపిణీ చేస్తున్న వేరుశెనగ రాయితీ విత్తనకాయలపై ఎన్నడూలేని విధంగా ప్రస్తుత ప్రభుత్వం ఈసారి కిలోకు ఒకేసారి రూ.13.90 పెంచేసింది. ఇంతకు ముందున్న ప్రభుత్వాలేవీ ఈ స్థాయిలో ధరను పెంచిందిలేదు.

కరువు రైతులపై కనికరం చూపాల్సిన సమయంలో ధరలతో బాదేస్తోంది. శ్వాశత సాగునీటి వనరులులేని జిల్లాలో 90శాతం రైతులు ఖరీఫ్ వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ప్రధానంగా పడమటి రైతాంగానికి ఖరీఫ్‌పంటలే దిక్కు. అత్యధికంగా వేరుశెనగ సాగయ్యేది ఈ ప్రాంతంలోనే. ప్రస్తుతం కిలో విత్తనకాయల ధర రూ.71.50 కాగా ప్రభుత్వం రూ.23.6 రాయితీ భరించి, రూ.47.50తో పంపిణీ చేసేందుకు నిర్ణయించింది.

 వరుస బాదుడిలా..
 2010 ఖరీఫ్‌లో జిల్లా రైతులకు రాయితీపై ప్రభుత్వం విత్తనకాయలను కిలో రూ.25కే సరఫరా చేశారు. 2011లో రూ.10 అదనపు భారం మోపి కిలో రూ.35కు పెంచారు. టీఎంవీ-2, నారాయణి, జేఎల్-24, పొల్లాచి రకం రూ.35తో, కె-6ను కిలో రూ.36తో పంపిణీ చేసింది. 2012లో రూ.19.50 రాయితీతో కిలో ధర రూ.39.50తో పంపిణీ చేశారు. 30కిలోల బస్తా ధర రూ.1,770 కాగా రూ.1,185కు ఇచ్చారు. 2013 ఖరీఫ్‌లో విత్తనకాయలు కిలోధర రూ.63.50గా నిర్ణయించగా, ప్రభుత్వం రూ.21 రాయితీ భరించి రూ.42.50కు పంపిణీచేసింది. 2014 ఖరీఫ్‌లో కిలో విత్తనకాయల అసలుధర రూ.50.90 కాగా రూ.16.90 రాయితీతో రూ.34తో రైతులకు సరఫరా చేశారు. ప్రస్తుతం రూ.47.90తో విత్తనకాయల పంపిణీకి నిర్ణయించడంతో కిలోపై రైతుకు రూ.13.90 పైసల భారం పడింది.

 నాలుగేళ్లలో రూ.31.36కోట్లు
 కరువురైతు చేతిలో పదివేలుంటే ఖరీఫ్‌లో కొద్దిపాటి పంటనైనా పెట్టుకొంటాడు. అలాంటిది జిల్లా రైతులపై పాలకులు విత్తనకాయలపై భార ం మోపూతూనే ఉన్నారు. ఖరీఫ్ సాగంటే దైవాధీనమే. ఈ పరిస్థితుల్లో రైతుల విషయంలో ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరించాలి. అలాంటి ప్రభుత్వాలే ధరలభారం మోపుతున్నాయి. పెరిగిన ధరతో రాయితీ విత్తనకాయల కోసం నాలుగే ళ్లలో రూ.31.36కోట్ల భారం భరించారు. 2011లో రూ.9.30 కోట్లు, 2012లో రూ.3.85 కోట్లు, 2013లో రూ.3.9కోట్లు భారాన్ని భరించారు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 1.3లక్షల క్వింటాళ్ల విత్తనకాయలపై అదనంగా రూ.14.31కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement