బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం

Rs 10 lakh compensation to Molestation affected girl - Sakshi

నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు 

నేరస్తులు ఏ పార్టీవారైనా కఠిన వైఖరే

బాలికల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు పాఠశాలల్లో కరాటే 

మహిళలు ఫోన్‌చేస్తే స్పందించేందుకు 100, 112 సిద్ధం

హోం మంత్రి మేకతోటి సుచరిత వెల్లడి

ఒంగోలు/ సాక్షి, అమరావతి: ఇటీవల ఒంగోలు నగరంలో గ్యాంగ్‌రేప్‌కు గురైన గుంటూరుకు చెందిన బాలికకు రూ.10 లక్షల పరిహారాన్ని అందజేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. బాధిత బాలికను పరామర్శించేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. జరిగిన ఘటన బాధాకరమని, బాధిత కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో ఉదారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏదైనా సమస్య వస్తే వారు 100 లేదా 112 నెంబర్లకు ఫోన్‌ చేస్తే తక్షణ సాయం అందించేందుకు పోలీసు సిబ్బంది సదా సిద్ధంగా ఉన్నారన్నారు. సమాజంలో ఎదురయ్యే పరిస్థితులను ఎలా అధిగమించాలనే విషయంపై పాఠశాలల్లోనే బాలికలకు అవగాహన కల్పిస్తున్నామని, దాంతోపాటు వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు కరాటే కూడా నేర్పుతామన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడుతున్నామన్నారు. నేరాలు చేయాలంటేనే నిందితులు భయపడే పరిస్థితులు తీసుకువస్తామన్నారు.  

బాలిక భవిష్యత్తుకు భద్రత..  
పరిహారం బాలికకు దక్కేలా, బాలిక భవిష్యత్తుకు భద్రత కల్పించేలా చర్యలు చేపడుతున్నామని సుచరిత చెప్పారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వ్యక్తి ఏ పార్టీ వ్యక్తి అయినా నేరస్తుడ్ని నేరస్తుడిగానే భావిస్తామన్నారు. ఈ విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో కూడా స్పష్టం చేశారన్నారు.   సమావేశంలో విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్, జాయింట్‌ కలెక్టర్‌–2 డాక్టర్‌ సిరి, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్‌జేడీ శారద తదితరులు పాల్గొన్నారు. 

గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై ముఖ్యమంత్రి ఆరా  
ఒంగోలులో బాలికపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఘటనకు పాల్పడిన వారి వివరాలను ప్రకాశం జిల్లా ఎస్పీ వివరించారు. ఘటన జరిగిన 24 గంటల్లోగా నిందితులను పట్టుకున్న ఎస్పీని సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top