వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది నోటికి ప్రభుత్వం తాళాలేస్తోంది. ఆ శాఖకు సంబంధించిన సమాచారమేదీ ....
సమాచారంపై అధికారులకు ఆంక్షలు
వైఫల్యం బయటపడుతుందన్న భయం
విశాఖపట్నం: వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది నోటికి ప్రభుత్వం తాళాలేస్తోంది. ఆ శాఖకు సంబంధించిన సమాచారమేదీ మీడియాకు, ముఖ్యంగా ‘సాక్షి’కి అందజేయరాదని ఆంక్షలు విధిస్తోంది. సాక్షి ప్రతినిధులు ఈ శాఖకు సంబంధించి ఏ సమాచారం అడిగారో ముందుగా తమకు తెలియజేస్తే, ఇవ్వాలో వద్దో చెబుతామని ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులు, కింది స్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు వెలువడ్డాయి. మరే ఇతర శాఖల్లోనూ లేని విధంగా వైద్య ఆరోగ్యశాఖలో తూ.చ. తప్పకుండా ‘పెద్దల’ ఆదేశాలను అమలు చేస్తున్నారు. కావలసిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు ఈమెయిల్ ద్వారా పంపుతున్నారు. అటు నుంచి ‘ఓకే’ అంటే సమాచారం ఇస్తున్నారు. లేదంటే మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలియకుండా పోయే ప్రమాదం తలెత్తింది. ఉదాహరణకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం (దీనిని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు) కింద 2007 నుంచి ఇప్పటిదాకా ఎంతమంది లబ్ధి పొందారన్న విషయాన్ని ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచుతోంది. ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన వివరాలను 2014 నుంచి మాత్రమే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టింది.
ఆరోగ్యశ్రీ పథకం అమలయిన 2007 నుంచి 2014 వరకు ఎంతమంది ప్రయోజనం పొందారో తెలిసే వీలు లేకుండా చేసింది. వాస్తవానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఆయన హయాంలో పేద, సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో అనేకమంది ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందారు. పైసా ఖర్చు లేకుండా వేల సంఖ్యలో గుండెకు శస్త్రచికిత్సలు చేయించుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. వైఎస్ మరణానంతరం సీఎం పీఠమెక్కిన ముఖ్యమంత్రులు ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తూ వచ్చాయి. 2014లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడానికే ప్రాధాన్యమిచ్చారు. ఆర్యోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చారు. క్రమేపీ ఈ పథకం కింద వైద్యం, శస్త్రచికిత్సలు చేసిన ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు రూ.వందల కోట్ల బకాయిలను చెల్లించడం మానేశారు. దీంతో ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ (నేటి ఎన్టీఆర్ వైద్యసేవ) పథకంలో వైద్యానికి ముందుకు రావడం లేదు. దీంతో ఈ పథకం అర్హులైన పేద, మధ్య తరగతి వారికి పూర్తి స్థాయిలో అందకుండా పోతోంది. ప్రభుత్వం తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇస్తే ఈ వ్యవహారమంతా ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందోనన్న భయంతో మీడియాకు ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లో డొల్లతనం బయటపడకుండా ప్రభుత్వం ఇలా జాగ్రత్త పడుతోంది.