ఆంక్షలుంటే మరో యుద్ధానికి సన్నద్ధం | Restricted preparing for another war | Sakshi
Sakshi News home page

ఆంక్షలుంటే మరో యుద్ధానికి సన్నద్ధం

Nov 28 2013 3:29 AM | Updated on Mar 18 2019 8:56 PM

తెలంగాణ ఏకైక ఏజెండాతో పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) ఇప్పుడు సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది.

కరీంనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఏకైక ఏజెండాతో పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) ఇప్పుడు సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. ఉద్యమం పేరిట మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. 13 ఏళ్ల టీఆర్‌ఎస్ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు తదితర పరిస్థితులను అనుకూలంగా మలచుకుని 2014 ఎన్నికల నాటికి సంస్థాగతంగా పూర్తి బలోపేతమయ్యేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్రం ఏర్పాటుచేస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించడం... కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో టీఆర్‌ఎస్ కార్యకర్తల్లో విలీనంపై అయోమయం ఏర్పడింది. ఎలాంటి ఆంక్షలు లేని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రకటిస్తేనే విలీనం విషయం ఆలోచిస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ ఈలోపు కార్యకర్తల అభిప్రాయాలు సేకరించింది.
 
 ఇటీవల నిర్వహించిన శిక్షణ శిబిరాల్లో మెజారిటీ కార్యకర్తలు విలీనంపై వ్యతిరేకత వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌లో విలీనం చేయొద్దంటూ కుండబద్దలు కొట్టారు. శిబిరాల్లో పాల్గొన్న నేతలు సైతం విలీనమయ్యే ప్రసక్తే లేదని, రాష్ట్ర పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్ ప్రముఖ పాత్ర పోషిస్తుందంటూ స్పష్టంచేయడంతోపాటు సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించారు. తెలంగాణ తామే తెచ్చామని జైత్రయాత్రల పేరిట కాంగ్రెస్ సభలు నిర్వహిస్తుండడం... టీఆర్‌ఎస్ ప్రజల్లోకి వెళ్లకపోవడంతో పరిస్థితి చేజారకుండా ఉండేందుకు వ్యూహాలు రూపొందించారు. తెలంగాణ కోసం 2009లో కేసీఆర్ దీక్షకు బయలుదేరిన నవంబర్ 29ని కీలకదినంగా భావిస్తూ జిల్లా వ్యాప్తంగా దీక్షాదివస్ పేరిట వేలాదిమందితో దీక్షలకు దిగడమే కాకుండా కేసీఆర్‌ను అరెస్టు చేసిన నాటి ఫొటోలు, ఫ్లెక్సీలను ప్రతీ నియోజకవర్గంలో ఏర్పాటు చేయూలని, 13 ఏళ్లుగా టీఆర్‌ఎస్ చేస్తున్న పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
 
 పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మండల, పట్టణ, నగర పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, శంకర్‌రెడ్డి తదితరులు ప్రసంగిస్తూ టీఆర్‌ఎస్ జోష్ పెంచుతూ... ఇతర పార్టీల గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మాయమాటలతో లబ్ధిపొందుతున్న ఆంధ్రా పార్టీలకు గుణపాఠం చెప్పే రీతిలో పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్‌లో ఎట్టి పరిస్థితుల్లో విలీనమయ్యే ప్రసక్తే లేదని, హైదరాబాద్‌పై ఏ చిన్న ఆంక్ష విధించినా మరో యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించే దీక్షా దివస్‌ను జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గ కేంద్రాల్లో విజయవంతం చేసే దిశగా కార్యకర్తలు కృషిచేయాలని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement