ఆరంభమైన గగనయానం

Restarting Civil Aviation Services In Andhra Pradesh - Sakshi

పునఃప్రారంభమైన పౌరవిమాన సేవలు 

చెన్నై నుంచి వచ్చిన ఇండిగో సర్వీసు 

రాజమహేంద్రవరం విమానాశ్రయంలో మొదలైన ప్రయాణికుల సందడి

సాక్షి, మధురపూడి: కరోనా మహమ్మారిని కట్టడి చేసే లక్ష్యంతో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన పౌరవిమాన సేవలు ఎట్టకేలకు పునఃప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌కు దశలవారీగా సడలింపులు ఇస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి దేశీయ విమాన సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చెన్నై నుంచి సాయంత్రం 5.10 గంటలకు ఒక విమానం వచ్చింది. ఇండిగో సంస్థ నడిపిన ఈ విమానంలో 78 మంది ప్రయాణించేందుకు అనుమతి ఉండగా 54 మంది వచ్చారు. ఈ విమానం తిరిగి 5.45 గంటలకు 48 మంది ప్రయాణికులతో ఇక్కడి నుంచి చెన్నైకి పయనమైంది. పౌరవిమాన సేవలు తిరిగి ప్రారంభం కావడంతో ఎయిర్‌పోర్టులో సందడి నెలకొంది. అయితే అనుకున్నన్ని విమాన సరీ్వసులు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చదవండి: ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు 


ప్రయాణికుల బ్యాగేజిని శానిటైజ్‌ చేస్తున్న సిబ్బంది

‘స్పందన’లో నమోదు చేసుకుంటేనే అనుమతి 
విమానంలో ప్రయాణించాలనకునేవారు రాష్ట్ర ప్రభుత్వ ‘స్పందన’ వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలి. వారికి మాత్రమే విమానయాన సంస్థలు టిక్కెట్లు విక్రయించాల్సి ఉంటుంది. 
రాష్ట్రానికి చేరిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అనుమానిత లక్షణాలుంటే వారం రోజుల పాటు ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉంచుతారు. 
వారం తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించి, నెగెటివ్‌ వచ్చిన వారికి మరో వారం రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచుతారు. 
తక్కువ కరోనా కేసులున్న ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు.. వైద్య పరీక్షలకు స్వాబ్‌ ఇచ్చిన తర్వాత 14 రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలి. 

హైదరాబాద్‌ సర్వీసు రద్దు 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం రావల్సిన విమాన సర్వీసు రద్దయ్యింది. మామూలుగా ఈ సర్వీసు ప్రతి రోజూ రాత్రి 8.55 గంటలకు వచ్చి, 9.25 గంటలకు తిరుగు పయనమవుతుంది. 

కట్టుదిట్టంగా నిబంధనల అమలు 
విమాన సేవలు పునఃప్రారంభమైన నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిర్దేశించిన నిబంధనలను పక్కాగా అమలు చేశారు. 
ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా ఏర్పాటు చేశారు. మాసు్కలు తప్పనిసరిగా ధరించేలా చూశారు. 
సింగిల్‌ బ్యాగేజీని మాత్రమే వెంట అనుమతించారు. 
అన్ని తనిఖీలు, పరిశీలనల అనంతరం ప్రయాణికులను విమానం వద్దకు పంపారు. 
ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారో లేదో పరిశీలించారు. 

హైదరాబాద్, చెన్నైకి సేవలు 
రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్, చెన్నై నగరాలకు విమాన సేవలున్నాయి. అయితే సోమవారం హైదరాబాద్‌ సర్వీసు రద్దయ్యింది. దేశంలోని ముంబయ్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ తదితర ఆరు మెట్రో నగరాల్లోని విమానాశ్రయాల నుంచి మిగిలిన నగరాలకు విమానాలు నడుస్తున్నాయి. ఆ నగరాల నుంచే మూడో వంతు సర్వీసులు నడుస్తాయి. విమానాలు అక్కడి నుంచి వస్తేనే తప్ప, వాటి రాకపోకల వివరాలను కచ్చితంగా తెలియజేసే పరిస్థితి లేదు. 
– మనోజ్‌కుమార్‌ నాయక్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్, రాజమహేంద్రవరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top