ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా! | resignation of MLAs to get the puddling | Sakshi
Sakshi News home page

ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా!

Mar 24 2016 1:42 AM | Updated on May 25 2018 9:20 PM

ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా! - Sakshi

ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా!

పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే సత్తా అధికార పార్టీకి ఉందా?

జలీల్‌ఖాన్ వెళ్లాక  పశ్చిమానికి పట్టిన పీడ విరగడైంది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యులు


విజయవాడ : పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే సత్తా అధికార పార్టీకి ఉందా? అని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలు విసిరారు. పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో రాజీ నామా చేయించే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. బుధవారం చిట్టినగర్‌లో వైఎ స్సార్ సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాజధాని పేరిట భూవ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారన్నారు. నదుల అనుసంధానం పేరిట దోపిడి, పట్టిసీమ పనుల్లో కాంట్రాక్టర్‌కు మేలు కలిగేలా 27 శాతం పెంచుతూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారన్నారు. నిబంధనలను పక్కన పెట్టి అసెంబ్లీని నడిపిస్తున్నారని, 29వ తేదీన బడ్జెట్‌కు అను కూలంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకునే సత్తా టీడీపీకి  ఉందా అని ప్రశ్నించారు.

 
పశ్చిమంలో వైఎస్సార్ సీపీకి తిరుగులేదు
పార్టీ నగర వ్యవహారాల ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి తిరుగులేదని నిరూపితమైందన్నారు. వైఎస్సార్ సీపీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మైనార్టీలను టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తానని విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ, ఒక రూపాయి తీసుకురాలేకపోయారన్నారు. నూజివీడు ఎమ్మెల్యే  ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. పశ్చిమం నుంచి ఎవరిని బరిలోకి దింపినా వారికి 40 వేల పైబడి మెజారిటీ వస్తుందని కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తే అర్థమవుతోందన్నారు. పార్టీ రాజ కీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ జలీల్‌ఖాన్  వెంట గన్‌మెన్,  కారు డ్రైవర్, మరో ఇద్దరే వెళ్లారని ఎద్దేవాచేశారు.

 
జలీల్‌ఖాన్‌ను గెలిపించే సత్తా ఉందా?

యువజన విభాగం రాష్ర్ట అధ్యక్షుడు  వంగవీటి రాధా మాట్లాడుతూ  జలీల్‌ఖాన్‌తో రాజీనామా చేయించి  అధికార పార్టీకి చెందిన  ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీకి తిరిగి గెలిపించుకునే సత్తా ఉందా అని ప్రశ్నించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ  పార్టీలో పదవులు అనుభవించి  కార్యకర్తలను, నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన గలీజ్‌ఖాన్ పీడ విరగడైందన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ  చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ ఉంటే  పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. గుంటూరు జిల్లా పరిషత్ పార్టీ ఫ్లోర్‌లీడర్ దేవళ్ల రేవతి, పార్టీ నాయకులు బండి నాగేంద్ర పుణ్యశీల, బేగ్,  కాలే పుల్లారావు అశోక్‌యాదవ్, కర్నాటి రాంబాబు పాల్గొన్నారు.

 

పశ్చిమ వైఎస్సార్ సీపీలో నూతనోత్తేజం
పశ్చిమ నియోజకవర్గ సమావేశం క్యాడర్‌లో నూతనోత్తేజం నింపింది. ‘ప్రతి వీధిలోనూ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఎంత మంది జలీల్‌ఖాన్‌లు పార్టీ పోయినా క్యాడర్ మాత్రం చెక్కుచెదరదు. క్యాడర్ గురించి మీరు ఆలోచించకుండా మేం చేయాలో చెప్పిండి’ అంటూ ఓ కార్యకర్త ప్రసంగించారు. క్యాడర్‌లో ఆత్మ విశ్వాసం నింపటమే లక్ష్యంగా పార్టీ ముఖ్యులు కసరత్తు చేశారు. నగర పరిశీలకుడు లేళ్ల అప్పిరెడ్డి, ఉత్తర, దక్షిణ కృష్ణా అధ్యక్షులు కొలుసు పార్థసారథి, కొడాలి నాని శ్రేణులతో మాట్లాడి అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారు. పార్టీ ముఖ్య నేతలకు పశ్చిమ నియోజకవర్గ క్యాడర్ ఆపూర్వ స్వాగతం పలికారు. పార్టీ జిల్లా వ్యవహారాల పరిశీలకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పార్టీ నాయకులు గజమాలతో సత్కరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement