సైబర్ నేరంలో యువకుడికి రిమాండ్ | Sakshi
Sakshi News home page

సైబర్ నేరంలో యువకుడికి రిమాండ్

Published Mon, Mar 14 2016 11:36 PM

Remand the youth in cyber crime

ఆరిలోవ : ఓ యువతిని వేధించిన యువకుడిని ఆరిలోవ పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో మధురవాడ ఏసీపీ దాసరి రవిబాబు తెలిపిన వివరాల ప్రకారం... కోటపాడు మండలం, పొడుగుపాలెం ప్రాంతానికి చెందిన బోకం సందీప్ రాజస్తాన్‌లోని బిట్స్‌బిలానీలో ఇంజినీరింగ్ చదువుతూ రెండో సంవ త్సరంలో నిలిపేశాడు. తల్లిదండ్రులకు తెలియకుండా విశాఖపట్నం వచ్చి గీతంలో నాలుగో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న వినయ్ అనే యువకుడితో స్నేహం చేశాడు. కొన్నాళ్లపాటు వినయ్ ఉంటున్న హాస్టల్ గదిలోనే ఉండేవాడు. అక్కడ ఉంటూనే సందీప్ ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి ఆ యువతితో అశ్లీల ఫొటోలు తీసుకున్నాడు. ఆ ఫొటోలతో ప్రత్యేకంగా ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. వాటి ఆధారంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. ఒకే సెల్‌ఫోన్‌లో వేర్వేరు సిమ్ కార్డులు వేసి ఫోన్‌లు చేసేవాడు. ఆ యువతి నుంచి డబ్బులు నేరుగా తీసుకోకుండా వేరే అకౌంట్లలో వేయమని చెప్పేవాడు. ఆ అకౌంట్ల నుంచి ఏటీఎం కార్డుల ద్వారా అతని అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని డ్రా చేసేవాడు. ఇలా పలు విడతల్లో సుమారు రూ.80 వేలు ఆ యువతి ముట్టజెప్పింది.

అయినప్పటికీ వేధింపులు ఆపకపోవడంతో ఆ యువతి ఇటీవల ఆరిలోవ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు చాకచక్యంగా సోమవారం సందీప్‌ను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి రూ.4వేలు నగదు, నాలుగు సిమ్ కార్డులు, 3 ఏటీఎం కార్డులు, ఒక పాన్‌కార్డు స్వాధీనం చేసుకున్నారు. సందీప్‌కు సహకరించిన అతని స్నేహితుడు వినయ్ పరారీలో ఉన్నాడని, అతనుకూడా ముద్దాయేనని ఏసీపీ వివరించారు. యువతిని మోసం చేయడంతో పాటు సెల్‌ఫోన్, ఫేస్‌బుక్  దుర్వినియోగం చేయడంతో సైబర్ నేరం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సందీప్‌ను పట్టుకున్న సీఐ సీహెచ్ ధనుంజయనాయుడు, ఎస్‌ఐ కాంతారావు, కానిస్టేబుళ్లు కాళీప్రసాద్, జయకృష్ణ, చందులను ఏసీపీ అభినందించారు.
 

Advertisement
Advertisement