నిజరూపం.. అపురూపం | Rampant Angela devotees candanotsavm | Sakshi
Sakshi News home page

నిజరూపం.. అపురూపం

May 3 2014 12:33 AM | Updated on Sep 2 2017 6:50 AM

నిజరూపం.. అపురూపం

నిజరూపం.. అపురూపం

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూపాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఏడాదికి ఒక్క రోజు మా త్రమే లభించే ఈ అరుదైన దర్శనాన్ని చేసుకుని భక్తిపారవశ్యంలో మునిగితేలారు.

  •   అప్పన్న చందనోత్సవానికి పోటెత్తిన భక్తులు
  •   స్వామిని దర్శించి పులకించిన భక్తజనం
  •   పకడ్బందీగా ఏర్పాట్లు
  •   ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ తరపున డాలర్ శేషాద్రి పట్టు వస్త్రాల సమర్పణ
  •  సింహాచలం, న్యూస్‌లైన్ : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూపాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఏడాదికి ఒక్క రోజు మా త్రమే లభించే ఈ అరుదైన దర్శనాన్ని చేసుకుని భక్తిపారవశ్యంలో మునిగితేలారు. వైశాఖ శుద్ద తదియని పురస్కరించుకుని అప్పన్న చందనోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి గురువారం అర్ధరాత్రి 12.30 నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు.

    సుప్రభాతసేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, కలశారాధన చేశారు. ఒంటి గంట సమయంలో స్వామిపై ఉన్న చందనాన్ని వెండి బొరుగులతో తొలగించి నిజ రూపభరితున్ని చేశారు. తెల్లవారుజామున 2.45 గంటలకు దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు కుటుంబ సమేతంగా తొలిదర్శనాన్ని చేసుకుని, పట్టు వస్త్రాలు సమర్పించారు.

    అనంతరం 3.15 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి 8.30 నుంచి సహస్ర ఘటాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. శ్రీ వైష్ణవస్వాములు గంగధార నుం చి వెయ్యి కలశాలతో జలాలను తీసుకొచ్చి స్వామి నిజరూపాన్ని అభిషేకించారు. 108 వెండి కలశాలతో అర్చకులు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు శీతలోపచారాలు చేశారు. అనంతరం స్వామికి తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించి నిత్య రూపభరితున్ని చేశారు.
     
    ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ
     
    రాష్ర్ట ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశ్వరరావు, టీటీడీ తరపున డాలర్ శేషాద్రి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు కూడా స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు.

    విశాఖ శారదా పీఠం స్వామిజీ స్వరూపనందేంద్ర సరస్వతి, రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తులు సూరి అప్పారావు, నూతి రామ్మోహనరావు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, కలెక్టర్ ఆరోఖ్యరాజ్, పోలీస్ కమిషనర్ శివధర్‌రెడ్డి, మాజీ మంత్రులు రెడ్డి సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల గురుమూర్తిరెడ్డి, గాజువాక అసెంబ్లీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి తదితరులు స్వామిని దర్శించుకున్నారు.    
     
    విస్తృత ఏర్పాట్లు
     
    తెల్లవారుజామున 3.15 నుంచే సాధారణ భక్తులకు స్వామి నిజరూప దర్శనాన్ని అధికారులు కల్పించారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు.
     
    ఈ ఏడాది ఫ్రీ పాస్‌లు జారీ చేయలేదు. ప్రొటోకాల్ వీఐపీలు, వీఐపీలకు వెయ్యి రూపాయల టికెట్లు అందజేశారు. లక్షా 25 వేల లడ్డూలను ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించారు. అడవివరం ఆరోగ్య కేద్రం ప్రధాన వైద్యాధికారి జగదీష్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆర్టీసీ పలు ప్రత్యేక బస్సులను నడిపింది. దేవస్థానం 40 బస్సులను ఉచితంగా కొండపైకి నడిపింది. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు విశేషలం దించాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement