ఫిబ్రవరిలో రాజన్న పశువైద్యం ప్రారంభం 

Rajanna Veterinary medical services Initiative in February - Sakshi

వైద్య సేవలు అందించనున్న 2,944 మంది పశు సంవర్థక సహాయకులు

సాక్షి, అమరావతి: రాజన్న పశువైద్యం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత ప్రారంభించనున్న 3,300 రైతు భరోసా కేంద్రాల్లో ఇది అందుబాటులోకొస్తుంది. మొదట రైతు భరోసా కేంద్రాలను ఫిబ్రవరి 1న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాజన్న పశువైద్యాన్ని కూడా అప్పటి నుంచే మొదలుపెట్టాలని పశు సంవర్థక శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే.. రైతు భరోసా కేంద్రాలను ఫిబ్రవరి 28న ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడంతో అప్పటి నుంచే రాజన్న పశువైద్యం కూడా అందుబాటులోకి రానుంది.

రాష్ట్రంలో 3,200 పశు వైద్యశాలలే ఉండటంతో పశువులకు, ఇతర జీవాలకు వైద్యం అందించడానికి పోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 నుంచి 30 కిలోమీటర్ల నిడివిలో కొన్ని ప్రాంతాల్లో పశు వైద్యశాలలు ఉండటంతో వ్యాధులకు గురైన పశువులకు చికిత్స అందించడానికి, ఆస్పత్రులకుతరలించడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి గ్రామంలోనూ పశువైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, ఈ మేరకు రానున్న రెండేళ్లలో ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రైతు భరోసా కేంద్రాలు, ప్రస్తుతమున్న పశువైద్యశాలల్లో రాజన్న పశువైద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.  

తొలి విడత 3,300 రైతు భరోసా కేంద్రాల్లో.. 
తొలి విడత ప్రారంభం కానున్న 3,300 రైతు భరోసా కేంద్రాల్లో రాజన్న పశువైద్యాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం రూ.50 కోట్లను విడుదల చేసింది. పశువులకు చికిత్స అందించడానికి షెడ్లు, మందులు, మెడికల్‌ కిట్స్, పశువుల దాణా, పశుగ్రాస విత్తనాలు, చాఫ్‌ కట్టర్లు, పాలు పితికే యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఖాళీగా ఉన్న 9,886 మంది పశు వైద్య సహాయకులను నియమించేందుకు ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్షకు 5,612 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 2,944 మంది ఉత్తీర్ణులు కావడంతో వారిని ఉద్యోగాల్లో నియమించింది. వీరితోపాటు ప్రస్తుతం పనిచేస్తున్నవారిని 3300 రైతు భరోసా కేంద్రాల్లో నియమించారు. వీరు వైద్యసేవలు అందించడంతోపాటు పశువులకు సమతుల పోషకాహార కార్యక్రమాలు, పశుఆరోగ్య సంరక్షణ కార్డులు, కిసాన్‌ కార్డులు, పశుగ్రాస లభ్యత, పశు నష్టపరిహారం పథకాన్ని అమలు చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top