బాబు వ్యాఖ్యలపై నిరసనల వెల్లువ

Protests All over Andhra Pradesh On Chandrababu comments - Sakshi

పలు జిల్లాల్లో ఆందోళనలు 

బాపట్ల/కర్నూలు(సెంట్రల్‌)/నెల్లూరు(పొగతోట): ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ను ఉద్దేశించి మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా సోమవారం కూడా నిరసనలు వెల్లువెత్తాయి. గుంటూరు జిల్లా బాపట్లలో చంద్రబాబు దిష్టిబొమ్మను డాక్టర్‌ అంబేడ్కర్‌ సేవా సమాజం, దళిత సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద దహనం చేశారు.

చంద్రబాబూ క్షమాపణ చెప్పు.. లేదంటే బయట తిరగనివ్వబోం
దళిత ఐఏఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు సోమవారం కర్నూలులో చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగించి ఆందోళన చేశారు. కలెక్టరేట్‌ ఎదుట చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు లాక్కున్న దిష్టిబొమ్మను తమకు అప్పగించాలని రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. అనంతరం కలెక్టర్‌ వీరపాండియన్‌కు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ఐఏఎస్‌ విజయకుమార్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనను బయట తిరగనివ్వబోమని హెచ్చరించారు. 

నెల్లూరులో ర్యాలీ నిర్వహించిన డీఆర్‌డీఏ, మెప్మా ఉద్యోగుల సంఘాలు 
దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డీఆర్‌డీఏ, మెప్మా ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. సంఘం నేతలు సోమవారం నెల్లూరులో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. చంద్రబాబుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని కోరుతూ జాయింట్‌ కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌కు వినతిపత్రమిచ్చారు. 

వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి
సాక్షి, అమరావతి: ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్‌ కమిషనర్ల సంఘం, మున్సిపల్‌ ఉద్యోగుల సంఘం చంద్రబాబును డిమాండ్‌ చేశాయి. రాజధాని అంశంలో ప్రభుత్వానికి బీసీజీ సమర్పించిన నివేదికలోని అంశాలను ప్రణాళిక విభాగం కార్యదర్శి హోదాలో విజయకుమార్‌ ప్రజలకు వివరించారని మున్సిపల్‌ కమిషనర్ల సంఘం అధ్యక్షురాలు అశాజ్యోతి, మున్సిపల్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి.వెంకటరామయ్య సోమవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రణాళికపరమైన నిర్ణయాలను ప్రజలకు వివరించడం ఆయన బాధ్యత అని తెలిపారు. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు విజయకుమార్‌ను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. 

బాబును తక్షణమే అరెస్టు చేయాలి
సెర్ప్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్‌
సాక్షి, అమరావతి: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దళితుల పట్ల ఆయనకి ఉన్న చిన్నచూపును బయటపెట్టిందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
ఉత్తరాంధ్ర దళిత ఉద్యోగుల సంఘం డిమాండ్‌
డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర దళిత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రతినిధి, విశాఖ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ దాసు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దళితులను కించపరుస్తూ మాట్లాడి వారిని మనోవేదనకు గురి చేశారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, లేకుంటే దళితులంతా ఏకమై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లా దళిత జేఏసీ కన్వీనర్‌ కల్లేపల్లి రామ్‌గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 
బాపట్లలో బాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న దళిత సంఘం నేతలు 

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్‌
గుంటూరు/చోడవరం: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం గుంటూరు రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావును ఆయన కార్యాలయంలో కలసి వినతిపత్రమిచ్చారు. అనంతరం కిషోర్‌ విలేకరులతో మాట్లాడుతూ..ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ను చులకన చేసి మాట్లాడిన చంద్రబాబును దళితులు క్షమించరన్నారు. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

మాజీ సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు
దళితులంటే మాజీ సీఎం చంద్రబాబుకు చులకన భావమని మరోసారి రుజువైందని మాల మహానాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ మాలమహానాడు నాయకులు చోడవరం పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.ఈశ్వరరావుకు  ఫిర్యాదు చేశారు.

దళితులకు క్షమాపణలు చెప్పాలి
మంగళగిరి: దళిత ఐఏఎస్‌ అధికారిని అవమానించేలా మాట్లాడి తాను దళిత, బీసీ అణగారిన వర్గాలకు వ్యతిరేకమని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారని, ఆయన వెంటనే దళితులకు క్షమాపణ చెప్పకపోతే తమ సత్తా చూపుతామని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. మూడు ప్రాంతాల్లో రాజధాని గురించి బోస్టన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను మీడియాకు వెల్లడించిన ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top