చంద్రబాబు తీరుపై మిన్నంటిన నిరసనలు 

Protests All over Andhra Pradesh On Chandrababu  - Sakshi

చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ మండపేటలో శిరోముండనం చేయించుకున్న నేతలు 

వికేంద్రీకరణకు మద్దతుగా పలుచోట్ల ప్రదర్శనలు 

మూడు రాజధానుల ఏర్పాటుకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరును నిరసిస్తూ ఆదివారం కూడా నిరసనలు వెల్లువెత్తాయి. విద్యార్థులు, యువత ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించి ప్రతిపక్షం తీరును ఎండగట్టారు.  
– సాక్షి నెట్‌వర్క్‌ 

ఉత్తరాంధ్రకు  ద్రోహం చేయొద్దు 
చంద్రబాబు, ప్రతిపక్ష నేతల వైఖరికి నిరసనగా విజయనగరం జిల్లా సాలూరులో విద్యార్థులు, యువకులు ఆదివారం భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేయొద్దని నినదించారు. ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం ద్వారా ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూస్తుంటే.. చంద్రబాబు, టీడీపీ నాయకులు ఆ ప్రయత్నానికి గండికొట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.  

అడ్డుకుంటే అధోగతే 
గుంటూరు నగరం పాలెంలోని ప్రభుత్వ గిరిజన కళాశాల విద్యార్థినులు ‘ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు’ అని రాసిన ప్లకార్డులను చేతబూని ప్రదర్శన నిర్వహించారు. గిరిజన ప్రజా సమాఖ్య (జీపీఎస్‌) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే వికేంద్రీకరణను అడ్డుకుంటే రాష్ట్రానికి అధోగతేనని అన్నారు.  
మూడు రాజధానులకు మద్దతుగా విజయనగరం జిల్లా సాలూరులో  జరిగిన బైక్‌ ర్యాలీలో భారీగా పాల్గొన్న ప్రజలు 

చంద్రబాబు, అచ్చెన్న దిష్టిబొమ్మల దహనం 
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించి పాలన వికేంద్రీకరణకు మద్దతుగా నినాదాలు చేశారు. పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

శిరోముండనం చేయించుకుని నిరసన 
అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమంటూ తూర్పు గోదావరి జిల్లా మండపేటలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, పార్టీ నేతలు వల్లూరి రామకృష్ణ, పిల్లా వీరబాబు, కొండపల్లి సత్తిబాబు తదితరులు శిరోముండనం చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ.. ప్రాంతీయ వైషమ్యాలు, విభజన వాదం రాకుండా ఉండాలన్నా, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నా వికేంద్రీకరణ ఒక్కటే మార్గమన్నారు.  ప్రజలూ వికేంద్రీకరణను స్వాగతిస్తున్నారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు వికేంద్రీకరణకు మద్దతు తెలిపితే ఆయనకు కొంతవరకైనా గౌరవం దక్కుతుందన్నారు. అంతకుముందు మాజీ సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని వేడుకుంటూ మాజీ సీఎం ఎన్టీ రామారావు విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top