కడుపుకోత!

Private Hospitals Abortions Anantapur - Sakshi

పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ ఉల్లంఘిస్తే మూడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు రూ 50 వేల జరిమానా. ఇదీ.. అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కనిపించే బోర్డు. అయితే ఆచరణలో చట్టం అభాసుపాలవుతోంది. చట్టం అమలుపై రెండు నెలలకోసారి సలహా సంఘం సమావేశం నిర్వహిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. కొన్ని ఆస్పత్రులు యథేచ్ఛగా అబార్షన్లు, లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో వైద్యఆరోగ్య శాఖ అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు అబార్షన్లను ప్రోత్సహిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

సాక్షి, అనంతపురం : ఆడపిల్ల అనగానే కడుపులోనే ప్రాణం తీసేసే పరిస్థితి నెలకొంది. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా..అమాయకత్వం, పేదరికం, అవగాహన లోపంతో గ్రామీణులు అబార్షన్లు చేయించుకుంటున్నారు. అన్నీ తెలిసిన కొందరు వైద్యులే ధనార్జనే ధ్యేయంగా అబార్షన్లు చేస్తుండడంతో ఆడపిల్లలు ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూస్తున్నారు. కాదు..కాదు చంపేస్తున్నారు. ఈ భ్రూణ హత్యలకు ఆరోగ్యశాఖ సిబ్బందే పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలున్నాయి. గడిచిన నెలన్నరలో రెండు అబార్షన్లు సాక్షాత్తు ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రమేయంతోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇక తెలియక జిల్లాలో మరెందరు ఆడపిల్లలు ఈ లోకాన్ని చూడక కన్నుమూస్తున్నారో తెలియని పరిస్థితి.   

శ్రేయ ఆస్పత్రిపై చర్యలేవీ?  
ఈ నెల 10న నగరంలోని శ్రేయ ఆస్పత్రిలో పెద్దపప్పూరు మండలం సోమనేపల్లికి చెందిన శివలక్ష్మి(5 నెలల గర్భిణి)కి డాక్టర్‌ రాజ్యలక్ష్మి అబార్షన్‌ చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఆడపిల్ల అనే కారణంగానే తాము అబార్షన్‌ చేయించుకున్నామని, అందుకు సదరు వైద్యురాలికి రూ.3800 ఇచ్చామంటూ బాధితురాలి భర్త శీన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అబార్షన్‌ చేశారన్న ఆరోపణలతో డీఎంహెచ్‌ఓ శ్రేయ ఆస్పత్రి స్కానింగ్‌ మిషన్‌ను సీజ్‌ చేశారు. ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత నెల 4న రాకెట్లతండాకు చెందిన జ్యోతిబాయి(5 నెలల గర్భిణి)కి పాల్తూరు పీహెచ్‌సీలో విధులు నిర్వర్తించే ఓ ఏఎన్‌ఎం అబార్షన్‌ చేయించింది. జ్యోతిబాయి తీవ్ర రక్తస్రావంతో సర్వజనాస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో అడ్మిట్‌ అయ్యింది.

అప్పట్లో ఏఎన్‌ఎంను సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఏఎన్‌ఎం సస్పెన్షన్‌ను రీవోక్‌ చేసి,  శ్రీధర్‌ఘట్టలోని డీ హొన్నూరులో పోస్టింగ్‌ ఇచ్చారు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు, ఏఎన్‌ఎంలపై ఆరోగ్యశాఖ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ను ఉల్లంఘిస్తున్నా వారిపై కేసులు నమోదు చేయకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. పేరుకు మాత్రమే యాక్ట్‌పై అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారని, చర్యలు తీసుకోవడంలో ఎటువంటి ముందడుగు వేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.  

ఆస్పత్రులతో లోపాయికారీ ఒప్పందం
అబార్షన్లు ప్రోత్సహించడంలో కొందరు ఏఎన్‌ఎం, ఆశాలకు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఉరవకొండ, నార్పల, గుంతకల్లు, హిందూపురం, తదితర ప్రాంతాల్లోని కొందరు సిబ్బంది ప్రైవేట్‌ ఆస్పత్రులతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అబార్షన్, లింగ నిర్ధారణ కేసులను జిల్లా కేంద్రంలోని కొన్ని ఆస్పత్రులతో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యశాఖ అధికారులు నిఘా ఉంచితే మరిన్ని అడ్డగోలు బాగోతాలు వెలుగు చూస్తాయంటూ ఆరోగ్యశాఖ సిబ్బంది చెబుతున్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top