బండిపై హలో.. జైలుకి చలో..!

Prison Punishment For Cellphone Driving in Amaravati - Sakshi

సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపితే కటకటాలే

జరిమానాలతో తీరు మారకపోవడంతో కఠిన చర్యలకు ట్రాఫిక్‌ పోలీసుల కసరత్తు

విజయవాడలో సెల్‌ డ్రైవింగ్‌తోనే అధిక ప్రమాదాలు    

సాక్షి, అమరావతిబ్యూరో: సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డుపై వాహనం నడుపుతున్నారా? అయితే మీ డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దుతోపాటు మీరు జైలుకు వెళ్లడం ఖాయం. ఎందుకంటే.. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు.. ఇది ప్రమాదాలకు దారితీస్తోందంటూ కోర్టులకు నివేదించనున్నారు. ఇప్పటికే మెట్రో నగరాల్లో ఇలాంటి కేసుల తీవ్రతను పరిశీలిస్తున్న న్యాయమూర్తులు జరిమానాతో పాటు జైలుశిక్షలు విధిస్తున్నారు. ఇటీవల నగర కమిషనరేట్‌ పరి«ధిలోనూ సెల్‌ఫోన్‌ చూస్తూ వాహనదారులు చేస్తున్న ప్రమాదాలు పెరుగుతుండడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు అప్రమత్తమై ఈ ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. 

ప్రమాదాల కారణాలు..
నగర ట్రాఫిక్‌ పోలీసులు వాహనచోదకులు సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్తున్నా, హెల్మెట్‌లో ఫోన్‌ను ఉంచుకుని వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని పట్టుకుంటున్నారు. పోలీసులు లేని చోట్ల కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానమైన సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. 2019 జనవరి నుంచి 2020 జనవరి వరకు 5,388 మందిపై సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు చేశారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్తున్న చోదకులు చేస్తున్న ప్రమాదాలు పెరుగుతుండడంతో కొన్ని ప్రత్యేక బృందాలు వాహనచోదకుల తీరును గమనిస్తున్నాయి. సెల్‌ఫోన్‌తో మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు చోదకుల ప్రవర్తనల్లో మార్పులను బృందం సభ్యులు పరిశీలించారు. ఫోన్‌ మోగగానే... ద్విచక్రవాహనచోదకులు వెంటనే దాన్ని చేతికి తీసుకుని మరో చేత్తో వాహన వేగాన్ని నియంత్రిస్తున్నారు. మరికొందరు అవతలి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు వినిపించకపోవడంతో ఫోన్‌ దగ్గరగా పట్టుకునే ప్రయత్నంలో యాక్సిలేటర్‌ ఎక్కువగా ఇస్తున్నారు. దీంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొడుతున్నారు. 

మూడేళ్లలో వెయ్యిమందికిపైగా మృత్యువాత..
విజయవాడలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా వీటి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. జరిగిన ప్రమాదాలను విశ్లేషిస్తే 80 శాతంపైగా ప్రమాదాలు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న సందర్భంలోనే చోటుచేసుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. 2017లో 349 మంది వాహనచోదకులు మృత్యువాత పడగా.. 2018లో 359 మంది, 2019 నుంచి 2020 జనవరి నాటి వరకూ 375 మంది మరణించారు.  

కఠిన చర్యలు ఉంటాయి..  
అధిక శాతం మంది ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకకుండా అడ్డదిడ్డంగా వాహనాలు నడపుతున్నారు. దీనివల్ల వారి ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలు పోవడానికి కారకులవుతున్నారు. అత్యధిక శాతం ప్రమాదాలు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న సందర్భంలోనే జరిగాయి. గత పదమూడు నెలల కాలంలో నగరంలో 5,388 మంది వాహనచోదకులు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలను నడుపుతుండటం వల్ల వారిపై కేసులు నమోదు చేశాం. ఇప్పటి వరకు కేవలం జరిమానాలతో సరిపెట్టాం. ఇకపై కఠిన చర్యలు తీసుకుంటాం.  – టీవీ నాగరాజు, విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top