ఆశల సాగుకు... | Prepared for the cultivation of paddy soil | Sakshi
Sakshi News home page

ఆశల సాగుకు...

Jul 10 2014 1:21 AM | Updated on Oct 1 2018 2:03 PM

ఆశల సాగుకు... - Sakshi

ఆశల సాగుకు...

పాలకులు పట్టించుకోకపోయినా వరుణుడు కరుణించాడు. జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరుగా వర్షాలు కురవడంతో అన్నదాతలు కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు.

  • ఖరీఫ్ సాగుకు అన్నదాతలు సన్నద్ధం
  •   వడివడిగా నారుమడులు
  •   నాట్లు వేసేందుకు రైతాంగం ముమ్మర కసరత్తు
  • పాలకులు పట్టించుకోకపోయినా వరుణుడు కరుణించాడు. జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరుగా వర్షాలు కురవడంతో అన్నదాతలు కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బోర్ల కింద నారుమడులు పోసినవారు నాట్లకు సిద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల  నారుమడులు వాడుబట్టిన దశలో వర్షాలు కురవడంతో జీవం పోసుకున్నాయి. అన్నదాతల్లో ఆనందాన్ని నింపాయి.
     
    చల్లపల్లి : జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు అన్నదాతల్లో సరికొత్త ఆశలు రేకెత్తించాయి. రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ఈసారి ఖరీఫ్‌లో 6.34లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేయనున్నారు. ఇప్పటికే బోర్ల సాయంతో ఉయ్యూరు, పామర్రు, గుడివాడ మండలాల్లోని పలు ప్రాంతాల్లో నారుమడులు పోశారు. మూడు రోజుల నుంచి కురిసిన వర్షాలకు ఆయా ప్రాంతాల్లో వరినాట్లు పనులు ప్రారంభించారు. మొత్తంమీద వాతావరణం చల్లబడి పలుచోట్ల వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
    .
     నారుమడులకు జీవం పోసిన వర్షం

    మొవ్వ, గుడివాడ, తోట్లవల్లూరు మండలాల్లో పోసిన నారుమడులకు సరిగా నీరందక నైలిచ్చి వాడుబట్టాయి. ఈ నేపథ్యంలో  గత మూడు రోజుల్లో జిల్లాలో 64మి.మీ సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో ఆయా మండలాల్లో నారుమడులు మళ్లీ జీవం పోసుకున్నాయి. దివిసీమలోని ఆరు మండలాలతోపాటు మచిలీపట్నం, పెడన, మొవ్వ మండలాల్లో రైతులు నారుమడులు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
     
     15లోపు నారుమడులు

    జూలై 15వ తేదీలోపు ఖరీఫ్ సాగుకు నారుమడులు పోసుకుంటేనే ఎక్కువ సాగు చేసే బీపీటీ-5204, 1061 వరి రకాలు సక్రమంగా దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. దీంతో పంటబోదెలు, మురుగు కాలువల్లో చేరిన వర్షం నీటితో అయినా నారుమడులు పోసుకునేందుకు రైతులు ఆతృత పడుతున్నారు. ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో వర్షాలు కురుస్తాయని రైతులు భరోసాగా ఉన్నారు. ఈ ఖరీఫ్‌కు పంటకాలువల ద్వారా సకాలంలో సాగునీరు అందే పరిస్థితి లేకపోవడంతో జిల్లా రైతులు వరుణుడుపైనే కొండంత ఆశలు పెట్టుకుని ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement