అసలే అంతంతమాత్రంగా ఉన్న విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత సంక్షోభంలో పడే పరిస్థితి నెలకొంది.
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్: అసలే అంతంతమాత్రంగా ఉన్న విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత సంక్షోభంలో పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజల కష్టాలు రెట్టింపుకానున్నాయి. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఆదివారం ఆ శాఖ ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు దిగారు. ఉద్యోగులు విధులకు రాకపోవడంతో 1,760 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విజయవాడలోని వీటీపీఎస్, 1,260 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కడపలోని ఆర్‌టీపీపీ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే కోతలు రెట్టింపవుతాయని అధికారులే చెబుతున్నారు. ఇప్పటికే పెరిగిన కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవి మరింత పెరిగితే జనజీవనం అస్తవ్యస్తం కానుంది.
ప్రస్తుతం నెల్లూరులో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు కోత విధిస్తున్నారు. లోడ్ రిలీఫ్ పేరుతో అనధికారికంగా మరో రెండు గంటలు అదనంగా కోత పెడుతున్నారు. విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోతుండడంతో జిల్లాకు రావల్సిన విద్యుత్ కోటా భారీగా తగ్గిపోనుంది. ఈ క్రమంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఉండతో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
స్తంభించనున్న జనజీవనం
విద్యుత్ కోతలు సోమవారం నుంచి తీవ్రం కానుండడంతో జనజీవనం స్తంభించే ప్రమాదం ఏర్పడింది. సామాన్య ప్రజలు కష్టాలు పడడంతో పాటు వాణిజ్య, వ్యాపార రంగాలు తీవ్రనష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే జ్యూస్, జెరాక్స్ షాపులు తదితర చిన్నతరహా దుకాణాలు నడుపుకునే వారు నష్టాల్లో ఉన్నారు. పరిశ్రమలు సైతం జనరేటర్ల ద్వారా ఉత్పత్తి చేసుకుంటున్న పరిస్థితి.
పభుత్వ కార్యాలయాల్లో ఉదయం, సాయంత్రం వేళలో సేవలు స్తంభిస్తున్నాయి. కంప్యూటర్లు పనిచేయకపోతుండడంతో ఉద్యోగులు కుర్చీలకే పరిమితమవుతున్నారు. అపార్టుమెంట్లలోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఇక అందరి కష్టాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.