ఉద్యోగాల విప్లవం

Power Department Lineman Notification In Andhra Pradesh - Sakshi

లైన్‌మన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

జిల్లాలో 632 పోస్టులు..

గ్రామ సచివాలయాల్లో 460, వార్డు సచివాలయాల్లో 172 

సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగులకు మరో వరం ప్రకటించారు. ఈ నెల రెండో తేదీన రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విద్యుత్‌ శాఖలో ఖాళీగా ఉన్న లైన్‌మన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే జిల్లాలో 1,60,591 మంది గ్రామ, వార్డు వలంటీర్ల నియామక ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థులకు 7వ తేదీ నుంచి శిక్షణ అందించనుంది. దీనికి తోడు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయల్లో 19 రకాల పోస్టులకు నిరుద్యోగులు పోటాపోటీగా దరఖాస్తు చేస్తున్నారు.

జిల్లాలో 632 పోస్టుల..
జిల్లాలో ఏపీ ఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఖాళీగా ఉన్న 632 పోస్టులను  భర్తీ చేయనున్నారు. ఇందులో గ్రామ సచివాలయాల్లో 460, వార్డు సచివాలయాల్లో 172 పోస్టులున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దరఖాస్తుల స్వీకరణకు ఆగస్ట్‌ 17 తుది గడువు కావడంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు 17 అర్ధరాత్రి 11.59 గంటల  వరకూ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐటీఐ, ఎలక్ట్రికల్, వైర్‌మెన్‌ ట్రేడ్‌ అర్హతలు
ఇప్పటికే పెద్ద సంఖ్యలో గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఆయా పోస్టులకు ఏదైనా డిగ్రీ, డిప్లొమా, ఇంటర్‌ను విద్యార్హతగా నిర్ణయించారు. ఐటీఐ, ఎలక్ట్రికల్‌ పూర్తి చేసిన వారికి అవకాశం లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రస్తుత లైన్‌మెన్‌ నోటిఫికేషన్‌తో వారంతా కోచింగ్‌ సెంటర్ల బాట పడుతున్నారు. ఐటీఐ, ఎలక్ట్రికల్, వైర్‌మెన్‌ ట్రేడ్‌తో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, ఎలక్ట్రికల్‌ డొమెస్టిక్‌ అప్లయెన్సెస్‌–రివైండింగ్, ఎలక్ట్రికల్‌ వైరింగ్‌–కాంట్రాక్టింగ్‌ చేసిన అభ్యర్థులకు ఈ పోస్టులు మంచి అవకాశాన్ని కల్పించనున్నాయి.

వయోపరిమితి సడలింపు..
లైన్‌మెన్‌ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఇతరులకు 35 ఏళ్ల వయసున్న పురుషులు అర్హులు. 20 శాతం పోస్టులు ఓపెన్‌ కేటగిరీలో, మిగిలినవి స్థానిక కోటాలో భర్తీ చేస్తారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఆరు నెలలకు ఒక మార్కు చొప్పున గరిష్టంగా 20 మార్కులు వెయిటేజీ ఇవ్వనున్నారు.

ఇవి తెలియాలి..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కరెంట్‌ స్తంభం ఎక్కడం తెలుసుండాలి. అలాగే మీటర్‌ రీడింగ్‌ నిర్వహణపై అవగాహన ఉండాలి. వివరాలకు ఏపీఎస్పీడీసీఎల్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top