దళితులపై కరెంటు దెబ్బ

దళితులపై కరెంటు దెబ్బ - Sakshi

 • ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు బాబు సర్కారు మంగళం!

 • 2011 నుంచి వాడుకున్న ఉచిత విద్యుత్తుకూ బిల్లులు వసూలు

 • ఎస్సీ, ఎస్టీలని నిరూపించుకోవాలని హుకుం.. కుల ధృవీకరణ తెమ్మంటూ మెలిక

 • సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దళితులు

 • బిల్లులు కట్టని 4 వేల కనెక్షన్లు కట్

 • ఉన్నపళంగా వేల రూపాయలు ఎలా కడతామంటూ దళితుల ఆవేదన

 • సాక్షి, హైదరాబాద్: మొన్న రైతులు.. ఇప్పుడు దళితుల వంతు. ఉచిత విద్యుత్ సౌకర్యం నుంచి తొలగింపునకు గురవుతున్న వర్గాలివి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ కరెంటు బిల్లుల కొరడాకు విలవిల్లాడుతున్న నిరుపేద వర్గాలివి. కొన్నేళ్లుగా వాడుకుంటున్న ఉచిత విద్యుత్‌కు బిల్లులు కట్టాలని ఇటీవల రైతులకు వేలల్లో బిల్లులు పంపిన సర్కారు.. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలపై ఇదే నిర్దయ ప్రదర్శిస్తోంది. వారి ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడుతోంది.

   

  2011 నుంచి వాడుకున్న విద్యుత్తుకు ఒక్కసారే వేలల్లో బిల్లులు పంపుతోంది. వారు షాక్ నుంచి తేరుకునేలోపే కనెక్షన్ కట్ చేస్తోంది. ‘అసలు మీరు దళితులేనా?’ అని ప్రశ్నిస్తోంది. రుజువులు చూపించాలని వెంటబడుతోంది. కుల ధృవీకరణ పత్రం చూపించని వారు ఉచిత విద్యుత్ పరిధిలోకి రారంటూ బిల్లుల కొరడా ఝళిపిస్తోంది.  దళితులకు ఉచిత విద్యుత్ ఇస్తామని 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి దళితులు బిల్లులు చెల్లించడంలేదు.  ఆ తర్వాత 2013 ఏప్రిల్‌లో సవాలక్ష నిబంధనలు పెట్టి దీన్ని చట్టబద్ధం చేశారు. 50 యూనిట్లకే ఉచిత విద్యుత్ అని చెప్పారు. ఆపైన ఒక్క యూనిట్ దాటినా ఉచిత విద్యుత్ పరిధిలోకి రారని, మొత్తం బిల్లు చెల్లించాలని షరతు విధించారు. అంటే వినియోగదారుడు 51 యూనిట్లు వాడినా అన్ని యూనిట్లకు బిల్లు చెల్లించాలి.  అప్పటికే ఎన్నికలు దగ్గర పడటంతో ప్రభుత్వం ఈ షరతులను గోప్యంగా ఉంచేసింది.  ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టగానే దళితుల ఉచిత విద్యుత్‌పై దృష్టి పెట్టారు.  కిరణ్ సర్కారు నిబంధనలకు తోడు గా, అసలు వీరంతా దళితులా కాదా తేల్చాలని డిస్కంలకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారికే నెలకు 50 యూనిట్ల ఉచిత విద్యుత్ వర్తింపజేయాలనే నిబంధన పెట్టారు. ఎప్పుడు కుల ధృవీకరణ పత్రం ఇస్తే అప్పటి నుంచే అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలి సింది.  ఇలా దళితులు వాడుకున్న కరెంటు కు బిల్లు వసూలు చేయాలని ప్రభుత్వం పరోక్షంగా చెప్పింది. అంతకు ముందు ఈ సర్టిఫికెట్ల నిబంధన లేదు. దీంతో దళితులెవరూ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదు. దీంతో వీళ్లందరినీ అధికారులు బకాయిదారులుగానే తేల్చారు. వీరందరి నుంచి తక్షణమే బిల్లులు వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈపీడీసీఎల్ పరిధిలో రూ. 53.96 కోట్లు, ఎస్పీడీసీఎల్ పరి ధిలో రూ. 50 కోట్ల మేర దళితులు బకాయిలు పడినట్టు విద్యుత్ శాఖ తేల్చింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు.  బిల్లులు చెల్లిం చని వారి ఇళ్ల విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారు. దీంతో రాష్టరంలోని 6,72,252 మంది ఎస్సీ, ఎస్టీలు కుల ధృవీకరణ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో దాదా పు 2 లక్షల మంది (30 శాతం) మాత్రమే ఇప్పటివరకు కుల ధృవీకరణ పత్రాలు అందించారు. మిగతా 4.72 లక్షల మందిని ప్రభుత్వం దళితులే కాదంటోంది. వారికి 50 యూనిట్ల ఉచిత విద్యు త్ ఇవ్వబోమని చెబుతోంది. పాత బకాయిలతో సహా బిల్లులు వసూలు చేయాలని అంటోంది.  చెల్లించని వారి కనెక్షన్లు తొలగిస్తున్నారు.ఇప్పటివరకు 4 వేలకు పైగా దళితుల ఇళ్ల కనెక్షన్లను తొలగించినట్లు సమాచారం.

   

  ఒకేసారి రూ.వేలల్లో వస్తున్నాయి

  నాకు ఒకేసారి 1,114 రూపాయల బిల్లు పంపారు. ప్రభుత్వం కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇంతేసి బిల్లులేస్తే ఎలా? ఏరోజుకారోజు పని చేసుకుని బతికేవాళ్లం. ఇన్ని వందల రూపాయలు ఒకేసారి ఎలా కట్టగలం?

  - డి భాగ్యమ్మ, ఎం పణుకువలస, బొబ్బిలి మండలం

   

  బిల్లు కట్టలేదని కనెక్షన్ తొలగించారు

  మాకు ఉచితంగా కరంటు ఇస్తారని రెండేల్ల క్రితం చెప్పారు. ఇప్పు్పడేమో వేలకు వేలు బిల్లులు వస్తున్నాయి. ఉచిత విద్యుత్తు అనేసరికి మేమెవ్వరం ఇప్పటివరకు బిల్లులు కట్టలేదు. ఇప్పుడు మొత్తం 1,546 రూపాయల బిల్లు పంపించారు. దానిని కట్టకపోయేసరికి అక్టోబరు నెలలో కరంటు కనెక్షన్ పీకేశారు. మళ్లీ దానికి అప్పులు చేసుకొని, జరిమానాలతో కలిపి 1,630 రూపాయలు కట్టాం. ఉచితమని చెపిప ఇన్నేసి వేల రూపాయల బిల్లులు వస్తే ఎలా?

   - కే సత్తెమ్మ, ఎం పణుకువలస, బొబ్బిలి మండలం

   

  ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే..: అధికారులు
  ఇందులో తమ తప్పేమీ లేదని ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ అధికారులు అంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే బిల్లులు వసూలు చేస్తున్నామని చెబుతున్నారు. డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. గత ఏవాగి మార్చి 31 నాటికి ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు విద్యుత్ సబ్సిడీ కింద ప్రభుత్వం రూ. 65.22 కోట్లు చెల్లించాలి. దీన్ని ఇంత వరకూ విడుదల చేయలేదని ఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. కుల ధృవీకరణ పత్రాలు సమర్పించిన తర్వాతే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిబంధనల కారణంగా బకాయిల కోసం దళితులను నిలదీయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top