లక్ష్యానికి తూట్లు !

Power Abusing In Villages YSR Kadapa - Sakshi

గ్రామాల్లో  నిరంతరాయంగా వెలుగుతున్న ఎల్‌ఈడీ బల్పులు   

పట్టించుకునే వారే కరువు  

కడప ఎడ్యుకేషన్‌ : జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలోని  పంచాయతీల్లో విద్యుత్తు బిల్లులను తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వీధిలైట్లకు ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్పార్‌ జిల్లాలో 790 గ్రామ పంచాయతీలకు గాను 322 గ్రామ పంచాయతీల్లో 61,100 ఎల్‌ఈడీ బల్పులను జూన్‌ 2నాటికి ఏర్పాటు చేశారు. కానీ ఏ లక్ష్యంతోనైతే వాటిని ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నెరవేడరం లేదు. అధికారుల నిర్లక్ష్యమో లేక కిందిస్థాయి సిబ్బంది అలసత్వమో తెలియదు కానీ లక్ష్యానికి మాత్రం తూట్లు పొడుస్తున్నారు. రాత్రి వేళల్లో మాత్ర మే వెలగాల్సిన ఎల్‌ఈడీ బల్బులు పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరంతరాయంగా వెలుగుతున్నాయి. ఫలితంగా విద్యుత్‌ బిల్లులు గతంలో మాదిరే వచ్చే అవకాశం ఉంది. విద్యుత్తు బిల్లులు తగ్గించాలనే ప్రభుత్వ లక్ష్యం మంచిదైనా కిందిస్థాయిలో అమలు చేసే వారి నిర్లక్ష్యం వల్ల సంబంధిత పథకం పలు విమర్శలకు తావిస్తోంది. ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేసే వారు వాటికి ఆన్‌ఆఫ్‌ చేసే కంట్రోల్‌కు సంబంధించిన ప్రత్యేక లైన్‌ను (తాడు వయర్‌) ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఎక్కడా అవి ఏర్పాటు చేయనట్లు తెలిసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో పగలు వెలగకుండా అరికట్టేందుకు  చర్యలు తీసుకోవాల్సిన  అవసరం ఉంది.

జాతీయ రహదారి వెంబడి: కడప కర్నూల్‌ జాతీయ రహదారిలో చెన్నూరు దాటాక ఖాజీపేట మండల పరిధిలో జాతీయరహదారి వెంబడి ఉన్న పలు  గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్పులు నిత్యం  వెలుగుతూ కనిపిస్తున్నాయి. కొత్తనెల్లూరు, సంజీవనగరం, కూనవారిపల్లె తదితర గ్రామాలతో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఈ విషయంలో అధికారులు స్పందించాల్సి న అవసరం ఉంది. లేకపోతే ఏలక్ష్యంతోనైతే ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నీరుగారిపోయే అవకాశం ఉంది. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి మోహన్‌రావ్‌ను వివరణ కోరగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ బల్పులు నిరంతరం వెలుగుతున్న ట్లు తమ దృష్టికి రాలేదన్నారు. అయినా దీనిపై పరి శీలించి చర్యలు తీసుకుంటామని వివరించారు.  

24 గంటలు వెలుగులే
మాగ్రామంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ వీధి బల్పులు నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నా యి. ఆన్‌ఆప్‌ చేద్దామంటే ఎక్కడ స్విచ్‌లుకానీ ఆన్‌ఆఫ్‌ కంట్రోల్‌ కానీ ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రింబవళ్లు అన్న తేడా లేకుండా నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి.– పెద్దరామయ్య, సర్పంచ్, చక్రాయపేట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top