భారీగా పెరిగిన ఫీజులు

Polytechnic fees increased from Rs 15,500 to Rs 25 thousand - Sakshi

విద్యార్థులపైనే భారం 

కానరాని రీయింబర్స్‌మెంట్‌

పాలిటెక్నిక్‌ ఫీజులు రూ.15,500 నుంచి రూ.25 వేలకు పెంపు 

డీఫార్మసీ ఫీజు రూ.17 వేల నుంచి రూ.25 వేలకు పెంపు 

ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల ఇక్కట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత, సాంకేతిక విద్య పేద, మధ్యతరగతి వర్గాలకు మోయలేని భారంగా మారుతోంది. ఆయా కోర్సుల ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచేయడమే దీనికి కారణం. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు చదువు‘కొన’లేక విద్యకు దూరమవుతున్నారు. ఇప్పటికే పాలిటెక్నిక్, ఫార్మసీ కోర్సులను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజులను పెంచడానికి కసరత్తు చేస్తోంది. అయితే ఫీజులు పెంచుతున్న ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌ను పెంచకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెరిగిన ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ప్రైవేటు కాలేజీల కోసమే ఫీజుల పెంపు..
ఇటీవల ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కాలేజీల ఫీజులను భారీగా పెంచింది. ప్రభుత్వ కాలేజీల్లో ఏడాదికి రూ.3800 ఫీజు ఉండగా దాన్ని ఏకంగా రూ.4700కు పెంచేసింది. ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఏడాదికి రూ.15,500 ఫీజు ఉండగా దాన్ని రూ.25 వేలు చేసింది. డీఫార్మా కాలేజీల్లో కోర్సుకు రూ.17 వేలు ఫీజు ఉండగా దాన్ని కూడా రూ.25 వేలకు పెంచారు. తమకు ప్రస్తుతమున్న ట్యూషన్‌ ఫీజు సరిపోవడం లేదని ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలి కాలేజీల యాజమాన్యాలకే పెద్దపీట వేసింది. ఫీజుల పెంపుపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులను పరిశీలించిన ఉన్నత విద్యాశాఖ ఫీజులు పెంచుతూ జూలై 9న జీవో 138 జారీ చేసింది.

ప్రస్తుతం ఎంఈ/ఎంటెక్‌ కోర్సులకు ఫీజు కనిష్టంగా రూ.57,000 – గరిష్టంగా రూ.1,00,000 వరకు ఉంది. అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కూడా రూ.27,000 నుంచి గరిష్టంగా రూ.68,000 వరకు ఫీజులు వసూలుచేస్తున్నారు. ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజులను వచ్చే ఏడాది పెంచనున్నారు. ఇక ఎంబీబీఎస్‌ కోర్సుకు ప్రైవేటు కళాశాలల్లో బీ కేటగిరీలో ఫీజు ఏడాదికి రూ.12.10 లక్షలు ఉంది. ఏటా కనీసం 5 శాతం చొప్పున ఈ ఫీజు పెరుగుతోంది. ఇక సీ కేటగిరీ (ఎన్‌ఆర్‌ఐ కోటా)లో బీ కేటగిరీ ఫీజుకు ఐదు రెట్లు మించి వసూలు చేయకూడదని నిబంధనలు ఉన్నా ఆయా ప్రైవేటు కళాశాలలు భారీ మొత్తాలు వసూలు చేస్తున్నాయి.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఊసెత్తని ప్రభుత్వం
గతంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఎంత ఫీజు అయినా ప్రభుత్వమే భరించేలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్‌ సహా ఇలా ఏ కోర్సు అయినా విద్యార్థులకు అయ్యే ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే ఆయా కాలేజీలకు రీయింబర్స్‌మెంట్‌ చేసేది. అయితే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆయా కోర్సులు ఫీజులు పెంచి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను గాలికొదిలేసింది. ఫీజులు పెంచినప్పుడు ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ చేసే మొత్తాన్ని పెంచాల్సి ఉండగా దాని ఊసెత్తడం లేదు. ఫలితంగా ఆయా కోర్సులకు పెరిగిన ఫీజు మొత్తాలను విద్యార్థులే చెల్లించుకోవాల్సి వస్తోంది.

వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్‌ ఫీజు రూ.1.50 లక్షలు!
ఇక ఇంజనీరింగ్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటాలో అత్యధిక ఫీజు రూ.1,08,000 వరకు ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం రూ.35 వేలు. మిగతా రూ.73 వేలు విద్యార్థులే భరించాల్సివస్తోంది. ఎంసెట్‌లో కేవలం పదివేల లోపు ర్యాంకు వచ్చినవారికి మాత్రమే ప్రభుత్వం మొత్తం ఫీజు చెల్లిస్తోంది. పదివేల ర్యాంకు దాటితే రూ.35 వేల ఫీజు మాత్రమే చెల్లిస్తోంది. దీంతో మిగిలిన ఫీజు కట్టలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని చదువుకుంటుండగా, మరికొంతమంది అంత భారాన్ని మోయలేక చదువుకు స్వస్తి పలుకుతున్నారు. 

ఫీజు చెల్లించకపోతే ఆయా కాలేజీలు పరీక్షల సమయంలో హాల్‌టిక్కెట్లు, కోర్సు పూర్తయ్యాక సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పరిస్థితి ఇంత తీవ్ర స్థాయిలో ఉండగా ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా మరోసారి ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజులు పెంచడానికి సమాయత్తమవుతోంది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల కోసం ట్యూషన్‌ ఫీజులను భారీగా పెంచే యోచన చేస్తోంది. ప్రస్తుత ఫీజుల విధానం 2018–19తో ముగియనుండడంతో వచ్చే ఏడాది నుంచి ఈ ఫీజులను మరింత పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఫీజులను గరిష్టంగా 1.50 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేపట్టడంతో ఇంజనీరింగ్‌ ఫీజులు మరింత భారం కానున్నాయి. ఇదే జరిగితే ఇంజనీరింగ్‌ విద్య పేదలకు అందని ద్రాక్షగా మిగలనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top