
కమిటీ ముందుంచాల్సిన మార్గదర్శకాలేంటి..ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలి?
కాలేజీల వారీగా డేటా సేకరణ.. విద్యార్థుల ఖాతాల్లోకి వేయడంపై తర్జనభర్జన
ప్రత్యేక బ్యాంక్ ఖాతా సాధ్యమేనా..ఫీజు రీయింబర్స్‌మెంట్ హేతుబద్ధీకరణపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ హేతుబద్ధీకరణపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ దిశగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సంక్షేమ, విద్యాశాఖ అధికారులతోపాటు కాలేజీ యాజమాన్య ప్రతినిధులను ఇందులో చేర్చాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హేతుబద్ధీకరణపై దృష్టి పెట్టారు. విద్యాశాఖ అధికారులతో ఆయన సంప్రదింపులు చేపట్టారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్ల మేర పేరుకుపోయాయి. ఇక నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొత్త మార్గదర్శకాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.
డేటా సేకరణ
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సమగ్ర సమాచారం సేకరించాలని ముఖ్యమంత్రి కార్యా లయం విద్య, సంక్షేమ శాఖలను ఆదేశించింది. దీంతో పాటే కాలేజీల నాణ్యత ప్రమాణాలపైనా నివేదిక కోరుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే కాలేజీల్లో హాజరు శాతం ఎలా ఉంది? కొన్నేళ్లుగా ఆయా కాలేజీల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎంతమంది ఉద్యోగాలు పొందారు? ఆ కాలేజీలు ఎన్నిసార్లు జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు పొందాయి? ఇలాంటి అనేక వివరాలను ప్రభుత్వం కోరినట్టు తెలిసింది.
నాణ్యత లేని కాలేజీలను దృష్టిలో ఉంచుకొని మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాలేజీలో కనీస స్థాయి ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, ఉద్యోగ అవకాశాలను కొలమానంగా తీసుకునే వీలుంది. దీంతో పాటు యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ, లేబొరేటరీలు ఉన్న కాలేజీలకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందనే నిబంధన తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
నేరుగా ఇస్తే సమస్యలేంటి?
విద్యార్థికి వారి బ్యాంకు ఖాతాలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తే వచ్చే సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారుల ద్వారా వాకబు చేసినట్టు తెలిసింది. దీనిపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం ఆలస్యమైతే, కాలేజీల నుంచి విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుందనే భావన విద్యార్థి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఖాతాల్లో డబ్బులు వేసినా, అవి వాడుకుంటే సమస్యలు వస్తాయనే ఆలోచన కొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజ మాన్యాలు మాత్రం ప్రత్యేక బ్యాంకు ఖాతా పెట్టాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని, కాలేజీ నిర్వహణ వ్యయాన్ని ఈ ఖాతాలో ఉంచాలన్న ప్రతిపాదన తీసుకొచ్చాయి. దీనికి బ్యాంకులు ఏమేర ముందుకొస్తాయనేది ఉన్నతాధికారులు పరిశీలించే పనిలో ఉన్నారు.