
తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్‌పై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో నేటి నుంచి ఇచ్చిన బంద్ పిలుపుపై యాజమాన్యాలు యూటర్న్ తీసుకున్నాయనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వంతో చర్చలు పూర్తైన తర్వాతే బంద్‌పై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నాయి. అయితే..
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సహా పలు డిమాండ్లతో నేటి నుంచి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్‌ను పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాకా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల తరఫున ప్రతినిధులతో మంత్రి భట్టి, అధికార వర్గాలు చర్చలు జరిపాయి. కానీ, ఆ చర్చలు ఎలాంటి పురోగతి సాధించలేదు. దీంతో నేటి బంద్‌పై ప్రతిష్టంభన నెలకొంది.
అయితే.. ఈ పరిణామంపై యాజమాన్యాల ప్రతినిధులు స్పందించారు. నేడు కాలేజీలను తెరవొద్దని నిర్ణయించినట్లు చెప్పారు. సోమవారం మధ్యాహ్నాం ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరుపుతామని, ఆ చర్చల తర్వాతే బంద్ కొనసాగింపుపై స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపారు. దీంతో ఇవాళ ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగనుందనే స్పష్టత వచ్చింది. అయితే కొన్ని కాలేజీలు మాత్రం ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తుండడం గమనార్హం.
ఎందుకీ నిర్ణయం?
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, బీఈడీ, ఎంబీఏ, నర్సింగ్ తదితర వృత్తి విద్యా ప్రైవేట్ కళాశాలల బంద్ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ కళాశాలల యాజమాన్యాల సమాఖ్య నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది. అంతేకాదు.. ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన ₹1,200 కోట్ల బిల్లులను దసరా లోపు చెల్లించాలని, మొత్తం బకాయిలను డిసెంబర్ 31లోపు పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటుపై feasibility నివేదికను అక్టోబర్ 31లోపు విడుదల చేయాలని కోరుతున్నారు.
మరోవైపు ఈ పరిస్థితుల మధ్య పరీక్షలు వాయిదా వేయాలని వర్సిటీలను ఫెడరేషన్ కోరుతోంది. ఈ పరిస్థితి విద్యార్థులు-తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాల మధ్య తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. బంద్ కొనసాగితే గనుక.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది.