ఇక్కడికొస్తే టాఠాణా!

Police Staff Fear On Jangareddy Gudem Polise Station West Godavari - Sakshi

అయ్య బాబోయ్‌ జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌

బెంబేలెత్తుతున్న అధికారులు, సిబ్బంది

స్వల్పకాలంలోనే బదిలీలవుతున్న వైనం

వాస్తులోపమని పలువురి చర్చ

జంగారెడ్డిగూడెం: అయ్య బాబోయ్‌ జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషనా.. అంటూ ఇక్కడకు కొత్తగా వచ్చే అధికారులు చెబుతున్న మాట. ఈ స్టేషన్‌కు వచ్చిన ఏ అధికారి కూడా పట్టుమని ఏడాది కూడా పనిచేయడం లేదు. అసలు ఈ పోలీస్‌స్టేషన్‌కు ఏమైంది? ఇది ప్రస్తుతం జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌పై చర్చ. ఇక్కడకు వచ్చిన అధికారి రెండేళ్లు కూడా పనిచేయడం లేదు. మధ్యలో ఒకరిద్దరు పనిచేసినా మిగిలిన వారంతా వివిధ రకాల కారణాలతో బదిలీ అవుతున్నారు. పలువురు అధికారులు వివిధ రకాల ఆరోపణలతో బదిలీ అయితే మరికొంత మంది పలు కారణాలతో బదిలీ అవుతున్నారు.

దీంతో జంగారెడ్డిగూడెంలో పనిచేయాలంటే అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోలీస్‌స్టేషన్‌పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అసలు ఈ పోలీస్‌స్టేషన్‌కు ఏమైంది. పోలీస్‌స్టేషన్‌కు వాస్తు లోపమా.. ఇంచుమించుగా పోలీస్‌స్టేషన్‌ కట్టిన నాటి నుంచి ఇదే పరిస్థితి నెలకొందని ప్రజలు, సిబ్బంది కూడా చర్చించుకుంటున్నారు. 2007 నుంచి ప్రస్తుత ఎస్సై వరకు అంటే 11 ఏళ్లలో 12 బదిలీలు జరిగాయి. ఇందులో కొన్ని చాలా చిన్న కారణాలతో బదిలీలు జరగడం గమనార్హం. పోలీస్‌స్టేషన్‌కు వాస్తుదోషం ఉందని ఈ ప్రాంతవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తదోషమో లేక గ్రహస్థితో తెలియదుగానీ ఇక్కడకు వచ్చిన అతి తక్కువ కాలంలో పలువురు సస్పెండ్‌ అవడం లేదా బదిలీలు కావడం జరిగిపోతోంది.

వివరాల్లోకి వెళితే..
2007లో ఇక్కడ పనిచేసిన సీఐ ఎం.వెంకటేశ్వరరావు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌ అయ్యారు. ఒక మహిళా కేసు విషయంలో ఈ బదిలీలు జరిగాయి. అప్పట్లో ఇక్కడ ఎస్సై చింతా రాంబాబు పనిచేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో రాంబాబుకు సీఐగా పదోన్నతి లభించింది. జంగారెడ్డిగూడెంలోనే పోస్టింగ్‌ ఇచ్చారు. 2008 జనవరిలో సీఐ చింతా రాంబాబు, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్‌ అయ్యారు. స్థానిక బైపాస్‌ రోడ్డులో కోడి పందేల నిర్వహణ నేపథ్యంలో ఒక వ్యక్తిని పోలీసులు తీసుకురావడం, అతను పోలీస్‌స్టేషన్‌లో అస్వస్థతతకు గురికావడం, వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లినా అతను మృతిచెందడంతో దీనికి సంబంధించి సీఐ రాంబాబు, ముగ్గురు కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్‌ చేశారు. ఆ తరువాత చాలా కాలం ఎస్సై లేకుండానే జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌ కొనసాగింది. అనంతరం 610 జీఓలో భాగంగా తెలంగాణ నుంచి ఎంవీఎస్‌ మల్లేశ్వరరావు ఎస్సైగా బదిలీపై వచ్చారు. సరిగ్గా ఐదు నెలలు అంటే 2008 మేలో మల్లేశ్వరరావు కూడా సస్పెండ్‌ అయ్యారు. అప్పట్లో సబ్‌రిజిష్ట్రార్‌పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేయాల్సి ఉండగా కేసు నమోదులో 13 రోజులు ఆలస్యం కావడంతో మల్లేశ్వరరావును ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

ఆ తరువాత ఎస్సైగా వచ్చిన ఏఎన్‌ఎన్‌ మూర్తిని 2009 మేలో వీఆర్‌లో ఉంచారు. ఆ తరువాత ఆయన్ను సస్పెండ్‌ చేశారు. ఇది కూడా సబ్‌రిజిష్ట్రార్‌ కార్యాలయానికి సంబంధించి దస్తావేజు లేఖరుల మధ్య జరిగిన విభేదాలపై కేసు నమోదు చేయకపోవడంతో మనస్తాపానికి గురై ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ఎస్సై మూర్తిని సస్పెండ్‌ చేశారు. ఆ తరువాత పి.శ్రీనివాసరావు ఎస్సైగా సుమారు 8 నెలలు పనిచేశారు. తరువాత బీఎన్‌ నాయక్‌ ఇక్కడ ఎస్సైగా వచ్చినా వివిధ కారణాలతో ఆయన కూడా బదిలీ అయ్యారు. ఆయన తరువాత పి.విశ్వం, బీఎన్‌ నాయక్‌ 2011 డిసెంబర్‌ నుంచి 2014 జనవరి వరకు పనిచేశారు. వారి తరువాత వచ్చిన సీహెచ్‌ రామచంద్రరావు 2014లో జనవరిలో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో పోలీస్‌స్టేషన్‌లో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకుని చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీనికి సంబంధించిన రామచంద్రరావును మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు.

2014 జూలైలో కె.శ్రీహరిరావు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించగా, ఆయనపై కూడా ఒక మహిళ ఆరోపణలు చేసింది. అయితే ఆయన కూడా ఇక్కడ 9 నెలలు మాత్రమే పనిచేసి బదిలీ అయ్యారు. ఆ తరువాత ఆనందరెడ్డి ఎస్సైగా వచ్చారు. ఆయన ఇక్కడ ఏడాదిన్నర పనిచేసిన అనంతరం వీఆర్‌కు వెళ్లారు. అనంతరం జంగారెడ్డిగూడెం ట్రాఫిక్‌ ఎస్సైగా వచ్చారు. ఆ తరువాత 2016 అక్టోబర్‌లో ఎస్సైగా వచ్చిన ఎం.కేశవరావు కేవలం 10 నెలలకే ఆరోపణలతో వీఆర్‌కు, అక్కడి నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. 2017 సెప్టెంబర్‌లో ఇక్కడ ఎస్సైగా జీజే విష్ణువర్ధన్‌ను నియమించారు. ఆయన కూడా ప్రస్తుతం వీఆర్‌కు వెళ్లారు. అయితే ఆయన తన ఇష్ట పూర్వకంగానే వీఆర్‌కు వెళుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే కేవలం 9 నెలలు మాత్రమే ఇక్కడ పనిచేశారు. అయితే ఇక్కడ పనిచేసే అధికారులు అనతికాలంలోనే బదిలీపై వెళ్లడంతో కొత్తగా ఈ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసేందుకు చాలా మంది వెనుకంజ వేస్తున్నట్లు తెలిసింది. కొంతమంది బదిలీల్లోను, సస్పెన్షన్‌లోను కారణాలు ఉన్నప్పటికీ మరి కొంతమందికి చాలా చిన్న చిన్న విషయాలకే బదిలీలు కావడం, వీఆర్‌కు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top