‘దీర్ఘకాలిక’ డీఎస్పీలందరికీ స్థానచలనం! | Police department ready to be transfered DSPs | Sakshi
Sakshi News home page

‘దీర్ఘకాలిక’ డీఎస్పీలందరికీ స్థానచలనం!

Nov 23 2013 2:14 AM | Updated on May 25 2018 5:59 PM

పోలీసుశాఖలో దీర్ఘకాలికంగా సబ్ డి విజన్లను అంటిపెట్టుకున్న డీఎస్పీలకు స్థానచలనం కలగనుంది.

సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖలో దీర్ఘకాలికంగా సబ్ డి విజన్లను అంటిపెట్టుకున్న డీఎస్పీలకు స్థానచలనం కలగనుంది. రెండేళ్లకుపైగా సబ్‌డివిజన్లలో ఉన్నవారు, వరుసగా రెండుసార్లు సబ్ డివిజన్లలో పోస్టింగ్‌లు పొందిన డీఎస్పీల జాబితాను పోలీసుశాఖ సిద్ధంచేసింది. రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నవారి జాబితా ఒకటి, రెండేళ్లకన్నా ఎక్కువగా సబ్‌డివిజన్లలో ఉన్నవారి జాబితా మరొకటి రెడీ చేశారు. రాజకీయ సిఫారసులతో వరుసగా కీలక స్థానాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను అప్రధానమైన పోస్టులకు బదిలీ చేసేందుకు పోలీసు ప్రధాన కార్యాలయం ప్రణాళిక రూపొందించింది. అదే సమయంలో దీర్ఘకాలికంగా అప్రధానమైన(శాంతిభద్రతల బాధ్యతలు కానివి) పోస్టుల్లో కొనసాగుతున్న వారందరికీ సబ్ డివిజన్ పోస్టులు అందించేందుకు కార్యాచరణ సిద్ధమైంది.
 
 ఈ మేరకు జాబితాలు సిద్ధమయ్యాయి. రాజకీయ నేతలతో సత్సంబంధాలు, ఇతరత్రా పలుకుబడి కలిగినవారు మాత్రమే కీలకమైన సబ్ డివిజన్లలో తిష్టవేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నెలన్నర క్రితం డీజీపీ బాధ్యతలను చేపట్టిన ప్రసాదరావు పోలీసుశాఖపై ఉన్న ఆ అపవాదును తొలగించే దిశగా ప్రయత్నాలు చేపట్టారు. పూర్తిస్థాయి డీజీపీగా యూపీఎస్‌సీ నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఆయన డీఎస్పీల బదిలీలపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా దీర్ఘకాలికంగా కొనసాగుతున్న డీఎస్పీల జాబితాలను, అలాగే అప్రధాన పోస్టుల్లో రెండేళ్లు, ఆపైగా కొనసాగుతున్న వారి జాబితాలను పంపాలంటూ పోలీసుశాఖలోని అన్ని విభాగాలను ఆదేశిస్తూ ఒక సర్క్యులర్ పంపారు. ఈ నేపథ్యంలో సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఏపీఎస్పీ విభాగాల్లో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న డీఎస్పీల జాబితా పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న డీజీపీల సమావేశానికి వెళ్లిన ప్రసాదరావు ఆదివారం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. దీంతో వచ్చేవారంలో భారీస్థాయిలో డీఎస్పీల బదిలీలు ఉంటాయని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు ద్వారా డీఎస్పీల బదిలీలకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement