కంపకళ్లితో ముగిసిన తిరునాళ్ల | Sakshi
Sakshi News home page

కంపకళ్లితో ముగిసిన చెన్నకేశవస్వామి తిరునాళ్ల

Published Thu, May 3 2018 12:03 PM

Police And ICDS Officials Stops Child Harassments In Kampakalli - Sakshi

చిన్నగొల్లపల్లి (హనుమంతునిపాడు): మండలంలోని చిన్నగొల్లపల్లిలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి తిరునాళ్లలో భాగంగా కంపకళ్లిని బుధవారం పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఆరు నుంచి పది అడుగుల ఎత్తున పేర్చిన ముళ్ల కంపపై నుంచి చిన్న పిల్లలను కిందకు దొర్లించడం వినేందుకే భయంగా ఉన్నా ఈ ప్రాంత భక్తులు దాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. కంపకళ్లిపై దొర్లిన బిడ్డకు ఎలాంటి రోగాలు దరి చేరవని భక్తుల అపార నమ్మకం. తరతరాలుగా ముళ్లకంపపై చిన్నారులను దొర్లించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లలను కంపకళ్లిపై దొర్లించడం చట్టరీత్య నేరమని అధికారులు అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఐసీడీఎస్, పోలీసు అధికారులు చిన్న పిల్లలను ముళ్లకంపై దొర్లించకుండా అడ్డుకున్నారు.

సుదూర ప్రాంతల నుంచి వచ్చిన పెద్దలు మాత్రమే దొర్లి పిల్లలను కంపకళ్లి తాకించుకుని తీసకెళ్లారు. భక్తులు అర్ధనగ్నంగా ముళ్లకంపపై దొర్లుతూ గోవింద..అంటూ తమ భక్తి చాటుకున్నారు. పాలెగాళ్లు కొనతాళ్లను ఎత్తుకుని పోతురాజుతో కంపకల్లి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చెన్నకేశవస్వామి తిరునాళ్ల కంపకల్లి కార్యక్రమంతో వైభవంగా ముగిసింది. ఐసీడీఎస్‌ వెలిగండ్ల ప్రాజెక్టు అధికారి లక్ష్మీప్రసన్న, కనిగిరి సీఐ సుబ్బారావుతో పాటు పలువురు పోలీసు అధికారులు దగ్గరుండి కంపకళ్లి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement