విజయనగరంలో ప్లాస్టిక్‌ భూతం..

Plastic Waste Heavy In Vizianagaram - Sakshi

పట్టణాలను ముంచెత్తుతున్న వ్యర్థాలు

పురపాలక సంఘాల్లో కానరాని చెత్తశుద్ధి

పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్‌ వ్యర్థాలు ముంచెత్తుతున్నాయి. వీధుల్లో... బహిరంగ ప్రదేశాల్లో... ఎక్కడ చూసినా చెత్తమయమై కనిపిస్తోంది. ఇళ్లల్లో వినియోగించే చెత్తను సైతం నిర్లక్ష్యంగా పారబోస్తుంటే వాటిని చక్కదిద్దాల్సిన యంత్రాంగం కిమ్మనడం లేదు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలనీ... తడి చెత్తనుంచి సంపద సృష్టించాలనీ... వ్యర్థాలను సమర్థంగా నిర్వహించాలనీ... సర్కారు చేస్తున్న యత్నాలకు స్థానికంగా గండిపడుతోంది. జనంలో చైతన్యం లేకపోవడం... అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడటం...  రాబోయే తరానికి కాలుష్యాన్నే మనం మిగిల్చేలా కనిపిస్తోంది.

సాక్షి , విజయనగరం: పురపాలక సంఘాల్లో తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలన్న ఆదేశాలు అమలు కావడం లేదు. జీవ ఔషధ వ్యర్థాలు, భవన నిర్మాణ వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో మున్సిపాలిటీలు నిండిపోయాయి. వాతావరణం కలుషితం అవుతోంది. విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రోజుకు 125 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. 40 వార్డుల్లో  విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య సిబ్బంది ఈ చెత్తను సేకరించి వాహనాల ద్వారా గుణుపూరుపేట డంపింగ్‌యార్డుకు తరలిస్తుంటారు. తడి, పొడి చెత్త సేకరణ ప్రక్రియ ఇప్పటికీ  కార్పొరేషన్‌లో అమలు కు నోచుకోవటం లేదు. ఉత్పత్తవుతున్న మొత్తం 125 టన్నుల చెత్తలో  విజయనగరంలోని ప్రధా న కూరగాయాల మార్కెట్‌తోపాటు రైతు బజా ర్ల నుంచి సేకరించే 14 టన్నుల వరకు  వ్యర్థాలను మాత్రమే వేరుగా తీసుకువెళ్లి కంపోస్టు ఎరువుగా మారుస్తున్నారు.

కొద్ది నెలలుగా చేపడుతున్న ప్రక్రియ ద్వారా 3 టన్నుల కంపోస్టు ఎరువును తయారు చేస్తుండగా... ఆ ఎరువును కిలో రూ.15ల చొప్పున విక్రయించనున్నారు. మరో 111 టన్నుల చెత్తను సేకరించి నేరుగా డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. తడి పొడి చెత్తను వేరుగా నిల్వ ఉంచేందుకు అవసరమైన బుట్టలను  కార్పొరేషన్‌ అధికారులు ఉచితంగా అందివ్వాలని ప్రజలు అడుగుతుండగా, అందుకు రూ.70లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఖర్చువుతుండటంతో వారు వెనకడుగు వేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో రెండు బుట్టలు విధానాన్ని అమలు చేయాలని ప్రజలకు ఉచితంగా అందజేయగా ఇప్పుడు అవెక్కడా కానరావడం లేదు. నగరంలో ఇటీవల కొన్ని రోజులు ప్లాస్టిక్‌ సంచుల వినియోగాన్ని నిషేధించామం టూ హడావుడి చేశా రు. వారం తిరక్కుం డానే ఆ విషయాన్ని పక్కనపెట్టేశారు.

అవార్డులు వచ్చాక పడకేసిన చెత్తశుద్ధి
బొబ్బిలి మున్సిపాలిటీలో తడిచెత్త పొడి చెత్తల సేకరణలో భాగంగా పట్టణానికి దూరంగా ఉన్న రామన్నదొరవలసలో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పార్కును నిర్వహిస్తున్నారు. చెత్త సేకరణ, ఎరువుల తయారీకి గతంలో బొబ్బిలి మున్సి పాలిటీకి నాలుగు అవార్డులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ విధానం పడకేసింది. మున్సిపాలిటీలో నివసించే కుటుం బాలు 14,500 ఉన్నా తడి చెత్త, పొడి చెత్త సేకరణకు అన్ని ఇళ్లకూ చెత్త బుట్టలు ఇవ్వలేదు. నాలుగింట ఒక వంతు మాత్రమే సరఫరా చేశారు. అవీ నాసిరకంవి కావడంతో చాలా వరకూ పాడయ్యాయి. ఇంటింటి చెత్త సేకరణ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయింది. మున్సిపాలిటీలోని 30 వార్డులుండగా వాటి నుంచి రోజుకు 17.5 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఇందులో తడి చెత్త 6.7 టన్నులు కాగా పొడి చెత్త 4.3 టన్నుల వరకూ ఉంటుంది. చెత్తనుంచి ఎరువు తయారుచేసేందుకు రామన్నదొర వలస వద్ద నిర్వహిస్తున్న సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పార్కులో ఎరువు ఇప్పుడు తయారు కావడం లేదు. ఇక్కడి పల్వనైజర్‌వంటి మెషీన్లు పాడయ్యాయి.

తీరని చెత్త సమస్య
పార్వతీపురం పురపాలక సంఘంలో 30 వార్డులున్నాయి. 200 వీధుల్లో చెత్త సేకరణకు కాంపెక్టర్లు 2, ఐదు ట్రాక్టర్లున్నాయి. రోజూ 38 మంది పారిశుద్ధ్య కార్మికులు 25 మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరిస్తున్నారు. పార్వతీపురంలో వాణిజ్య సముదాయం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి చెత్త ఎక్కువగా ఉత్పన్న మౌతోంది. రోజూ మున్సిపల్‌ పారిశుద్ధ్య విభాగం అధికారులు 25 మెట్రిక్‌ టన్నుల వరకు చెత్తను సేకరిస్తున్నారు. పురపాలక శాఖ తడి, పొడి చెత్తలను వేరు వేరుగా ఇవ్వాలని చెబుతున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో కార్య రూపం దాల్చడం లేదు. ఈ చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించి సేగ్రిగేషన్‌ చేయాల్సి ఉన్నప్పటికి అక్కడ అధికారులు ఆ పనిచేయడంలేదు. సాలూరు మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త సేకరణ కొంతవరకూ ఫరవాలేదనిపించేలా జరుగుతోంది. సుమారు 132 మంది సిబ్బంది ఈ పనిచేస్తున్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై మాత్రం మున్సిపల్‌ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top