కొత్త చిక్కుల్లో కరణం!

Petitioner Said Wife And Daughter Were Not Included In The Karanam Balaram Election Affidavit - Sakshi

బలరాం ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి

ఎన్నికల అఫిడవిట్‌లో భార్య, కుమార్తె వివరాలు పొందుపర్చలేదని పిటిషన్‌

ఆమంచి ఆరోపణలపై నోరు మెదపని పెద్దాయన

జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారిన వ్యవహారం

కరణం కొత్త వివాదంపై జిల్లా టీడీపీ నేతల్లో ఆందోళన

కరణం బలరాం.. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. ఆయన ఏ పని చేసినా వివాదాస్పదమే.. తాజాగా బలరాం కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు.. అందులోంచి ఎలా బయటపడాలో తెలియక విలవిల్లాడుతున్నారు.. ఇన్నాళ్లూ గుట్టుగా ఉంచిన వ్యవహారాన్ని ఆమంచి రట్టు చేసేశారు.. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేగా బలరాం ఎన్నిక చెల్లదంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పుడీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల అఫిడవిట్‌లో కరణం తన కుమార్తె అంబిక పేరును చూపకుండా దాచి పెట్టారంటూ ఆమంచి వేసిన పిటిషన్‌ జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని చీరాల టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి..  ఆమంచి ఆధారాలను బయటపెట్టడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల క్రితం ఆమంచి హైకోర్టులో పిటీషన్‌ వేసినా.. మంగళవారం విలేకర్ల సమావేశం పెట్టి మరీ బలరాం బండారాన్ని బయట పెట్టారు. ఇంత జరుగుతున్నా ఆ పెద్దాయన మాత్రం నోరు మెదపక పోవడంతో తప్పు చేయడం వల్లే మౌనంగా ఉన్నారనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సమర్పించిన నామినేషన్‌ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేదని, చట్టప్రకారం బహిర్గతం చేయాల్సిన వాస్తవాలను వెల్లడించలేదంటూ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంబిక కృష్ణ అనే కుమార్తె ఉన్నప్పటికీ బలరాం తన నామినేషన్‌లో ఆమె వివరాలు పొందుపరచలేదని పిటిషన్‌లో పేర్కొనడంతో ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన ఆమంచి హైకోర్టులో ఎన్నికల పిటీషన్‌ (ఈపీ) దాఖలు చేయడంతో చీరాల టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తల్లో గత మూడు రోజులుగా ఇదే చర్చ కొనసాగుతోంది.


అంబిక కృష్ణ ఆధార్‌ కార్డు, విద్యార్హత పత్రాల్లో తండ్రి పేరు కరణం బలరామకృష్ణమూర్తిగా నమోదైన దృశ్యాలు (సర్కిల్‌లో) 

హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడమే కాకుండా ఆమంచి విజయవాడలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆధారాలు బయటపెట్టడంతో కరణం వర్గీయులు అంతర్మథనం చెందుతున్నారు. అంబిక తన కుమార్తె కాదని బలరాం అంటే ఏ పరీక్షకైనా అంబిక సిద్ధంగా ఉందని ఆమంచి సవాలు చేసినా కరణం బలరాం మాత్రం ఈ వ్యవహారంపై ఇంత వరకూ నోరు మెదప లేదు. చిన్న ఆరోపణ వస్తేనే అంతెత్తు ఎగిరిపడే తమ నాయకుడు మూడు రోజులుగా తీవ్ర ఆరోపణలు వ్యక్తమౌతున్నా మౌనంగా ఉండిపోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోన చెందుతున్నారు. మౌనం అర్ధాంగీకారమే కదా అనే చర్చా జిల్లాలో కొనసాగుతోంది. ఏదైనా రాజకీయపరమైన వివాదం అయితే పార్టీ తరఫున ఖండించే అవకాశమైనా పార్టీ నేతలకు ఉండేది. వ్యక్తిగతమైన వివాదం కావడంతో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని జిల్లా టీడీపీ నేతలు సైతం మిన్నకుండిపోతున్నారు.

ఆమంచి ఆరోపణలు ఇవీ...
► కరణం బలరాంకు 1985లో ప్రసూన అనే మహిళతో శ్రీశైలంలో వివాహం జరిగింది.
► వీరిరువురికీ అంబిక కృష్ణ 1989లో హైదరాబాద్‌లోని సెయింట్‌ థెరిస్సా హాస్పిటల్‌లో జన్మించింది.
► అంబిక ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి అని ఉంది.
► అంబిక అన్నప్రాసన, మొదటి పుట్టిన రోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరాం ఉన్నారు.
► బలరాం తన నామినేషన్‌లో ప్రసూన, అంబిక కృష్ణల వివరాలను పొందుపర్చకుండా దాచిపెట్టారు.
► ఎన్నికల చట్ట నింబంధన ప్రకారం కరణం నామినేషన్‌ చట్ట ఆమోదయోగ్యమైన నామినేషన్‌గా పరిగణించడానికి వీల్లేదు.
► బలరాం ఎన్నికను రద్దు చేయాలి.. అంతేకాకుండా చీరాల నియోజకవర్గం నుంచి తాను(ఆమంచి) ఎన్నికైనట్లు ప్రకటించాలి.
► తన తండ్రి ఎవరనేది ప్రపంచానికి చెప్పాలని అంబిక కోరిక.. ఆమెకు న్యాయం చెయ్యాలని నేను ప్రయత్నిస్తున్నా.. పదవుల కోసం కాదు.
► అంబిక తన కూతురు కాదని బలరాం అంటే కనుక ఫోరెన్సిక్, డీఎన్‌ఏ వంటి ఏ పరీక్షకైనా అంబిక సిద్ధంగా ఉన్నారు.
 కన్న కూతురు పేరు ఎన్నికల అఫిడవిట్‌లో పెట్టని కఠినమైన వ్యక్తి కరణం బలరాం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top